ఇంటింటికీ జీఎస్టీ 2.0 ఫలాలు..!
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:26 PM
దేశంలో తగ్గిన జీఎస్టీతో ఇంటింటికీ జీఎస్టీ2.0 ఫలాలు చేరుతున్నాయి. తగ్గింపు జీఎస్టీ ప్రయోజనాలు, సంస్కరణలపై విసృత ప్రచారం చేయడంతో పాటు ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘
‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరిట అవగాహన
16న కర్నూలులో 3 లక్షల మందితో భారీ సభ
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు
మూడు స్థలాలు పరిశీలించిన మంత్రుల బృందం
ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష
కర్నూలు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో తగ్గిన జీఎస్టీతో ఇంటింటికీ జీఎస్టీ2.0 ఫలాలు చేరుతున్నాయి. తగ్గింపు జీఎస్టీ ప్రయోజనాలు, సంస్కరణలపై విసృత ప్రచారం చేయడంతో పాటు ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరిట వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఈ నెల 16న కర్నూలులో మూడు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోనే ఇది తొలి సభ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సహా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహిస్తోంది. మూడు లక్షల మంది హాజరయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. సభా స్థలం ఎంపికపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సారథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం సోమవారం మూడు స్థలాలను పరిశీలించారు.
మూడు లక్షల మందితో భారీ సభ
ఎన్టీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు, ప్రయోజనాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కర్నూలు నగరంలో ఈ నెల 16న మూడు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సహా కూటమి ముఖ్య నేతలు పాల్గొనే ఈ సభ ఏర్పాటుకు నన్నూరు టోల్ ప్లాజా వద్ద, రాగమయూరి వెంచర్, ఓర్వకల్లు సమీపంలో జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ వద్ద మూడు స్థలాలను రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి పరిశీలించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర, ప్రధానమంత్రి కార్యక్రమాలు స్పెషల్ కో-ఆర్డినేటర్ వీరపాండియన్, కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ ఎ.సిరి, రాజకుమారి, ఎస్పీలు విక్రాంత్ పాటిల్, సునీల్ షెరాన్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, గౌరు చరిత, భూమా అఖిలప్రియ, కేఈ శ్యాంబాబు, డాక్టర్ పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏ.రామకృష్ణ తదితరులు పరిశీలించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భద్రత, ఉమ్మడి కర్నూలు, నంద్యాల సహా రాయలసీమ జిల్లాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా, సభ దిగ్విజయం చేసేలా మూడు స్థలాలను పరిశీలించారు. చివరికి రాగమయూరి వెంచర్ ఎంపిక చేశారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష
ఈ నెల 16న ప్రధాని మోదీ సభను దిగ్విజయం చేయడం, జన సమీకరణ, భద్రత, బందోబస్తు, రూట్ మ్యాప్‌పై స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాకు చెందిన ఎంపీ, ఎమెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశంలో సభా నిర్వహణపై పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల వారిగా జన సమీకరణపై కూడా చర్చించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సభా ఏర్పాటు కమిటీల్లో బాధ్యతలు అప్పగించే అంశాలపై కూడా చర్చించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టిగా, సమన్వయంతో కష్టపడి 16న జరిగే ప్రధాని మోదీ సభను దిగ్విజయం చేద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. వేదిక, బస్సులు సమకూర్చడం వంటివాటిపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాకు చెందిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభను విజయవంతం చేయాలన్నారు. రెవెశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా దిశానిర్దేశం చేశారని, ప్రతి ఒక్కరు బాధ్యతగా దిగ్విజయం చేసేందుకు కృషి చేయాలన్నారు. మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి మాట్లా డుతూ సభా నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్ల కనెక్టివిటీ పెంచాలని రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ ఎస్‌ఈలను ఆదేశించారు. పీఎం కార్యక్రమాల స్పెషల్ ఆఫీసర్ వీర పాండియన్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల సహ కారంతో సభను విజయవంతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, వాల్మీకి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బొజ్జమ్మ, సీఎం ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, టీడీపీ ఆదోని ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, ఆలూరు, మంత్రాలయం ఇన్‌చార్జిలు వైకుంఠం జ్యోతి, ఎన్.రాఘవేంద్రరెడ్డి, టీడీపీ రాష్ట్ర అర్గనైజింగ్ కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ, ఏపీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.