Share News

రైతుబజారుకు పూర్వ వైభవం

ABN , Publish Date - May 16 , 2025 | 12:38 AM

వైసీపీ హయాంలో కుంటుపడిన అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

రైతుబజారుకు పూర్వ వైభవం

చురుగ్గా అభివృద్ధి పనులు

రోడ్డు వెడల్పునకు శ్రీకారం

డ్రైనేజీలకు మరమ్మతులు

పర్యవేక్షిస్తున్న అధికారులు

రైతులు చెప్పే సమాధానాలపై కసరత్తు

రైతుబజార్‌ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించేనా?

వైసీపీ హయాంలో కుంటుపడిన అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోనే రైతు బజార్ల నిర్వహణలో మూడోస్థానంలో ఉన్న సి.క్యాంపు రైతుబజార్‌ ఉంది. ‘స్వచ్ఛాంద-స్వర్ణాంధ్ర’లో భాగంగా కర్నూలు సి.క్యాంపు రైతుబజార్‌ను పర్యటించేందుకు సీఎం సిద్ధమయ్యారు. రైతుబజారులో సీఎం చంద్రబాబు చేసే తనిఖీలను అంచనావేసి పూర్తి స్థాయిలో ఈకార్యక్రమం విజయవంతం చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతుబజారు, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. రోడ్ల వెడల్పు, డ్రైనేజీల మరమ్మతులు, మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి పనులు చేపడుతున్నారు. సీఎం రాక సందర్భంగా నగరానికి కొత్త శోభ సంతరించుకుంది. రోడ్ల ప్యాచ్‌ వర్క్‌ పనులు చేపట్టారు. డివైడర్లకు రంగులు వేస్తున్నారు.

కర్నూలు అగ్రికల్చర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): సీ.క్యాంపు రైతుబజారుకు పూర్వవైభవం రానుంది. ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సీ.క్యాంపు రైతుబజారులో పర్యటించనున్నారు. రైతుబజారును సుందరంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆదేశాల మేరకు జేసీ నవ్య రైతుబజారుతో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. రాష్ట్రంలోనే రైతు బజార్ల నిర్వహణలో మూడోస్థానంలో ఉన్న సీ.క్యాంపు రైతుబజార్‌ ఉంది. ఏవిధంగా ఆస్థాయికి చేరిందో ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని సీఎం తెలుసుకొని ఈ రైతుబజారును ఏవిధంగా అభివృద్ధి చేశారో, ఎంతమంది రైతులు ఏయే గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారో ఎంత మంది వినియోగదారులు ప్రతిరోజు ఇక్కడకు వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారో స్వయంగా పరిశీలించనున్నారు.

పనుల పర్యవేక్షణ

సి.క్యాంపు రైతుబజారులో సీఎం చంద్రబాబు చేసే తనిఖీలను అంచనావేసి పూర్తి స్థాయిలో ఈకార్యక్రమం విజయవంతం చేసేందుకు రైతుబజార్‌ రాష్ట్ర సీఈవో మాధవీలత, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ విజయ సునీతతో పాటు కడప జేడీ రామాంజనేయులు రైతుబజారులో చేపట్టాల్సిన, జరుగుతున్న పనులను జేసీ నవ్య గురువారం పర్యవేక్షించారు. పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం తనిఖీలు చేసేందుకు ఎటువంటి ఆటంకాలు, ట్రాఫిక్‌ రద్దీ లేకుండా రైతుబజారు ముందు ఉన్న రోడ్డును వెడల్పు చేశారు. రైతుబజారులో కాలువలను మరమ్మతులు చేశారు. మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. రైతుబజారు ఎస్టేట్‌ అధికారి కళ్యాణమ్మతో పాటు హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌, సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం చేశారు. రైతులతో సీఎం చంద్రబాబు ఏమి మాట్లాడుతారో.. ఆయన అడిగే ప్రశ్నలకు రైతులు చెప్పాల్సిన సమాధానాలపై మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేశారు.

ముగ్గురు రైతుల ఎంపిక

రైతుబజార్‌ లక్ష్యం నెరవేరేందుకు అధికారులు చేస్తున్న కృషిని ప్రత్యక్షంగా పరిశీలించిన ముగ్గురు ఆదర్శ రైతులను మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి క్రిష్ణగిరి మండలం అమకతాడులో తనకున్న పొలం లో పూర్తిస్థాయిలో సేంద్రీయ ఎరువులతోనే వివిధ రకాల పంటలను పండిస్తూ సీ.క్యాంపు రైతుబజారులో ఉన్నతాధికారుల సహకారంతో స్టాల్‌ను ఏర్పాటుచేసి సేంద్రీ య ఆహారోత్పత్తులను విక్రయిస్తున్న సూర్యప్రకాష్‌ రెడ్డి ఏ విధంగా ఈస్థాయికి చేరాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నతాధికారులు పూర్తి చేశారు. చిన్నటేకూరు చెందిన పరమేష్‌ సేంద్రీయ ఎరువులతో కూరగాయలను సాగు చేస్తూ పండిస్తున్నారు. ఈ రైతుబజారులోనే తాను పండించిన కూరగాయలను ప్రజలకు విక్రయిస్తూ మంచి లాభం పొందుతున్నాడు. పాండురంగడు అనే రైతు ఉల్లితో పాటు ఆకుకూరలను తనకున్న రెండెకరాల పొలంలో సాగు చేసి తక్కువ ధరకే వినియోగదారులకు విక్రయిస్తూ గుర్తింపు పొందాడు. ఈ ముగ్గురు రైతులు ప్రజలకు ఆరోగ్యకరమైన కూరగా యలను చౌకగా ఎలా అందిస్తున్నారో సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.

వైసీపీ హయాంలో..

ప్రతిరోజు కూరగాయలు కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు ఆరు, ఏడు వేల మంది దాకా ఈ రైతుబజారుకు వస్తున్నారు. నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల నుంచి రైతుబ జారును గట్టెక్కించేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రతిపాదనలను పంపినా అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. రైతుబజారును అనుకుని ఉన్న శిథిలావస్థకు చేరిన పది రెవెన్యూ క్వార్టర్స్‌ను రైతుబజారుకు అప్పగించి విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని దాదాపు రూ.4 కోట్లతో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు చేశారు. నిధులు కూడా మంజూర య్యాయి. వైసీపీ ప్రభుత్వం రాకతో ఆనిధులు వెనక్కు వెళ్లాయి. మళ్లీ ప్రస్తుతం ఈ రెవెన్యూ క్వార్టర్స్‌ను కూలగొట్టి అక్కడ సీ.క్యాంపు రైతుబజారును విస్తరించేందుకు మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ విజయసునీతకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. సీఎం చంద్ర బాబునాయుడు తన పర్యటనలో సీ.క్యాం పు రైతుబజారు విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకా శముందని మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

నగరానికి కొత్త శోభ

కర్నూలు న్యూసిటీ, మే 15(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో నగరానికి కొత్త శోభ రానుంది. ఈనెల 17వ తేదీన సీఎం నగరానికి వస్తున్న సందర్భంగా నగరపా లక సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల పనులు చేపట్టారు. దీంతో నగరమంతా కళకళలాడుతోంది. ప్రధానంగా నంద్యాల చెక్‌పోస్టు నుంచి సీ.క్యాంపు సెంటర్‌ వరకు ప్రధాన రహదారులకు ఇరువైపులా పుట్‌పాత్‌ గోడలకు రంగులు వేస్తున్నారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. ఎండిపోయిన మొక్క ల స్థానంలో కొత్త మొక్కలను నాటుతున్నారు. డివైడర్లలో కొత్త మొక్కలు నాటడంతో పచ్చదనంతో కళకళలాడుతోంది. సీ.క్యాంపు కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు డివైడర్లకు కూడా రంగులు వేస్తున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:38 AM