Share News

రెపరెపలాడిన కార్మిక పతాకం

ABN , Publish Date - May 02 , 2025 | 12:01 AM

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గురువారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.

రెపరెపలాడిన కార్మిక పతాకం
మేడే వేడుకల్లో మాట్లాడుత్ను కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్‌

జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు

కేంద్ర విధానాలపై పోరాడాలి

మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ పిలుపు

కర్నూలు న్యూసిటీ, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గురువారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ కార్మిక, శ్రామిక, రాజకీయ తదితర పార్టీల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు కొనసాగాయి. అన్నిచోట్లా కార్మిక జెండా రెపరెపలాడింది. పలు పార్టీలు, సంఘాల నాయకులు పార్టీ కార్యాలయాలు, కార్మిక కూడళ్లలో ఎర్రజెండాలను ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ,ఉద్యోగ, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. సీపీఎం, సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ తదితర సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా నుంచి మార్కెట్‌ యార్డు వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీపీఎం సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ అరుణపతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం సుందరయ్య భవన్‌లో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో గఫూర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే కష్టజీవుల జెండా ఎర్రజెండా అన్నారు. కార్మికులపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 20న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె నిర్వహిస్తున్నాయన్నారు. ఆ సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పీఎస్‌.రాధాకృష్ణ, ఆనంద్‌బాబు, రాముడు, పి.నిర్మల, నగర కార్యదర్శివర్గసభ్యులు ఆర్‌.నరసింహులు, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ జిల్లా సమితి కార్యాలయంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరిగాయి. జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య స్థాపన కోసం అందరూ కలిసికట్టుగా పోరాటాలకు సిద్ధం కావాలాన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:01 AM