సుపరిపాలనలో తొలి అడుగు!
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:34 AM
సీఎం చంద్రబాబు సారథ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. వైసీపీ విధ్వంసం..
ప్రతిష్టాత్మకంగా ‘సూపర్ సిక్స్’ అమలు
తల్లికి వందనం, రూ.4 వేల పింఛన్‌తో జనం ఖుషీ
నేటి నుంచి ఇంటింటా ప్రజాప్రతినిధులు, నేతలు
కర్నూలు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సారథ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. వైసీపీ విధ్వంసం.. అరాచక పాలనకు స్వస్తి చెప్పాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టి జనం మధ్యకు వెళ్లాయి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని ఎన్టీఏ కూటమి అధికారం చేపట్టింది. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు ద్వారా ‘ఇంటింటా సంక్షేమం.. పల్లెపల్లెన ప్రగతి చేసి చూపిస్తాం’ అంటూ ప్రధాన హామీలు ఇచ్చారు. ఏడాది పాలనలో వృద్ధులకు పింఛన్ రూ.4 వేలకు పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డీఎస్సీ.. వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేసి అండగా నిలవాలని ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు కసరత్తు పూర్తయింది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏడాదిలో సాధించిన విజయాలు, సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి పనులు ఇంటింటికీ వెళ్లి వివరించడమే కాదు. ఇంటింటికీ ఇవ్వాల్సిన సంక్షేమం, ఆ పల్లెలో చేయాల్సిన అభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేయడమే మహోన్నత ఆశయంతో నేటి నుంచి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏడాదిలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
3.67 లక్షల విద్యార్థులకు తల్లికి వందనం
జిల్లాలో 25 మండలాల్లో 2,242 పాఠశాలలు ఉన్నాయి. ఆయా బడుల్లో 4,73,823 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో ‘తల్లికి వందనం పథకానికి’ 3,67,614 మంది విద్యార్థులు అర్హులు. వీరికి ఒక్కొక్కరికి రూ.13 వేలు చొప్పున రూ.477.89 కోట్లు తల్లులు ఖాతాలో జమ చేశారు. పాఠశాలల మౌలిక వసతులకు రూ.73.52 కోట్లు ఇచ్చారు. 2,26,181 కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం నేరుగా లభించింది. గత వైసీపీ హయాంలో అమ్మఒడి కేవలం ఒక విద్యార్థికే ఇస్తే.. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎందరు విద్యార్థులు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇచ్చింది. ఐదుగురు పిల్లలు ఉన్న కుటుంబాలు ఒక్కో తల్లి ఖాతాలో రూ.65 వేలు జమ చేయడం కొసమెరుపు.
ఇంటింటా దీపం.. యువతకు మెగా డీఎస్సీ
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో దీపం పథకం ఒకటి. జిల్లాలో 6.40 లక్షల గ్యాస్ కనెక్షన్లు కలిగిన వినియోగదారులు ఉన్నారు. వీరిలో దీపం పథకం కింద 4.85 లక్షల మంది పేదలు నమోదు చేసుకున్నారు. వీరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుతున్నాయి. అలాగే కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో అన్న క్యాంటీన్ల ద్వారా వేలాది మంది పేదల ఆకలి తీరుస్తున్నారు. మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 16,347, ఉమ్మడి జిల్లాలో 2,600 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు.
త్వరలో..
సూపర్ సిక్స్ పథకాల్లో అన్నదాత సుఖీభవ ఒకటి. కేంద్రం రూ.6 వేలు, రాష్ట్రం రూ.14 వేలు కలిపి రూ.20 వేలు పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథ కం ద్వారా ఇవ్వనున్నారు. జిల్లాలో 2.56 లక్షల మంది అర్హులైన రైతులను గు ర్తించారు అలాగే స్వాతంత్య్ర దినోత్స వం ఆగస్టు 15న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేయనున్నారు.
అవ్వ తాతల మోమున చిరునవ్వులు
ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులకు రూ.200 పింఛన్ ఇస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు ఒకేసారి ఐదు రెట్లు పెంచి రూ.1,000 చేశారు. 2019 ఎన్నికల ముందు రూ.2 వేలకు పెంచారు. వైసీపీ అధికారంలోకి వస్తే రూ.3 వేలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక దశలవారీగా ఐదేళ్లలో రూ.వెయ్యి పెంచుతానని మాట మార్చారు. 2024 ఎన్నికల్లో పింఛన్ రూ.4 వేలు చేస్తానని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైన హామీ ఇచ్చింది. జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారం చేపడితే.. జూలై ఒకటో తారీఖునే వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ, కాలేయం, తలసేమియా బాధితులకు రూ.10 వేలు, పూర్తి వైకల్యం కలిగిన వారికి రూ.15 వేలకు పెంచారు. జిల్లాలో వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులు 2,45,229 మంది ఉన్నారు. ప్రతి నెల రూ.115-120 కోట్లు ఇస్తున్నారు.
పారిశ్రామిక ప్రగతి.. హైకోర్టు బెంచ్
గడ్డపై పారిశ్రామిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యక్తి కావడం ఇందుకు కారణం. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి ఫేజ్-1 కింద 2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులకు టెండర్లు పూర్తి చేశారు. వివిధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యం. జపాన్‌కు చెందిన ఇటోయో మైక్రో టెక్నాలజీ కొర్పోరేషన్, ఇండియాకు చెందిన హైడ్రెన్ గ్రూప్, బీఎన్ గ్రూపులు సంయుక్తంగా దాదాపు రూ.14 వేల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ 130 ఎకరాల్లో స్థాపించేందుకు ఒప్పందం చేసుకున్నారు. 1200 ఎకరాల్లో రూ.13 వేల కోట్లతో ‘ఈవీ పార్క్’కు ఒప్పందం, 300 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా రిలయన్స్ సంస్థ రూ.1,266 కోట్లతో జ్యూష్ తయారి పరిశ్రమ స్థాపనకు ఒప్పందం చేసుకుంది. 80 ఎకరాలు ఎకరం రూ.30 లక్షల చొప్పున కేటాయించారు. వీటితో పాటు రూ.16,500 కోట్లు పెట్టుబడులు, 12-13 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు 7 సోలార్, విండ్ ప్రాజెక్టులకు ఒప్పందం జరిగింది. అలాగే.. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చర్యలు వేగంగా చేస్తున్నారు.
ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్లాలి
పి.తిక్కారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
కర్నూలు అర్బన్, జూలైౖ 1(ఆంధ్రజ్యోతి): నెల రోజుల పాటు జరిగే ‘సుపరి పాలన తొలి అడుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేశ్ ఇటీవల జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారని తెలిపారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు, వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నేతల విధ్వంసాన్ని ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సహా అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఏడాదిలో ఎంత లబ్ధిపొందారు, అర్హులైన వారు ఎంత మంది ఉన్నారు, గ్రామంలో చేసిన అభివృద్ధి, చేయాల్సిన ప్రగతిపై ప్రజలకు వివరించాలని కోరారు. మై టీడీపీ యాప్ ద్వారా చేసిన పనులు అధిష్ఠానానికి తెలియజే యాలన్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.