Share News

సాగుకు అన్నదాత సుఖీభవ

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:43 PM

రబీ సాగుకు సన్నద్ధం అవుతున్న రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

సాగుకు అన్నదాత సుఖీభవ

రేపు రైతుల ఖాతాల్లోకి రూ. 7 వేలు

రైతుకు అండగా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం నిధులు

రెండో విడత రూ.185 కోట్లు

2.65 లక్షల మందికి ఆర్థిక భరోసా

కర్నూలు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రబీ సాగుకు సన్నద్ధం అవుతున్న రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బుధవారం అన్నదాత సుఖీభవ - పీఎస్‌ కిసాన్‌ పథకం’ రెండో విడత నగదు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు చొప్పున జమ చేయనున్నారు. ఈకేవైసీ చేసుకున్న రైతుల వివరాలు ప్రకారం జిల్లాలో 2.65 మంది రైతుల ఖాతాల్లో రూ.185.50 కోట్లు జమ చేయనున్నారు. అయితే.. మంగళవారం రైతుల తుది జాబితా వస్తుందని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 2న ఓ పండుగ వాతావరణంలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బుధవారం కూడా అదే తరహాలో పంపిణీ చేసేందుకు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి అధ్వర్యంలో వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 4,19,221 హెక్టార్లు కాగా, రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.20 లక్షల హెక్టార్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ల్లో సాగు చేసిన పత్తి, మిరప, ఉల్లి రైతులు అధిక వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా రబీ సాగుపై ఆశలు పెంచుకున్నారు. కష్టాల నుంచి కొంతైనా గట్టెక్కవచ్చని రబీ సీజన్‌ సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కొండంత ఆర్థిక భరోసా లభించనుంది.

ఇచ్చిన మాటకు కట్టుబడి

పంట సాగు చేయడానికి రైతులకు అప్పులు పుట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే సాయంతో కలపి రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అందజేస్తామని గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి మేనిఫెస్టోలో కూడా సుపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ కింద అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో నియోజకవర్గాల వారిగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పంపిణీ చేసేలా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతుల ఖాతాల్లో జమ చేయనున్న అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌ నిధులు. సుమారుగా రూ.కోట్లల్లో..

నియోజకవర్గం రైతులు రాష్ట్రం కేంద్రం మొత్తం

ఆలూరు 59,000 29.50 11.80 41.30

కోడుమూరు 35,000 17.50 7.00 24.50

పాణ్యం 30,000 15.00 6.00 20.00

పత్తికొండ 51,000 25.50 10.20 35.70

మంత్రాలయం 41,000 20.50 8.20 28.70

ఆదోని 18,000 9.00 3.60 12.60

ఎమ్మిగనూరు 31,000 15.50 6.20 21.70

మొత్తం 2,65,000 132.50 53.00 185.50

Updated Date - Nov 17 , 2025 | 11:43 PM