Share News

ప్రతి పల్లెలోనూ బీజేపీ జెండా ఎగరాలి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:43 AM

రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో బీజేపీ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు.

ప్రతి పల్లెలోనూ బీజేపీ జెండా ఎగరాలి
సమావేశంలో ఖడ్గం ఎత్తి అభివాదం చేస్తున్న నాయకులు

రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో బీజేపీ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని ఓ కల్యాణమండపంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నగరంలోని రాజ్‌విహార్‌ కూడలి నుంచి పెద్దపార్కు, పాత కంట్రోల్‌ రూం మీదుగా సభాస్థలికి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుందన్నారు. పార్టీలోని అన్ని అనుబంధ విభాగాల్లో యువతకు పెద్ద పీట వేస్తామన్నారు. రాయలసీమలో ప్రాజెక్ట్‌ల నిర్మాణం, పరిశ్రమలకు ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. సీమ ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకవెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం ఎంతో వెనకబడిందని, దీని కోసం గతంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామన్నారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఏర్పాటు చేసి చాలా వరకు సాధించామన్నారు.

రాయలసీమ డిక్లరేషన్‌ను మరోసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గుండ్రేవుల ప్రాజెక్ట్‌పై అంచనాలతో నివేదించిన ప్రభుత్వాలు మారటంతో కార్యరూపం దాల్చలేదని, దానిని మరోసారి ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ఎవరినైనఅందలం ఎక్కించేది కేవలం ఒక్క బీజేపీ పార్టీలోనే అన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీల్లోలాగా వారసత్వాలను నమ్ముకున్న పార్టీ కాదని, బీజేపీ జవసత్వాలతో పనిచేసే పార్టీ అన్నారు.

పార్టీ రాష్ట్ర నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కల్గిన కమ్యూనిస్టు పార్టీలు నామరూపాల్లేకుండా పోతే, జాతీయవాదం కల్గిన బీజేపీ దేశాన్ని పాలిస్తోందన్నారు. శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌ పోతుగుంట రమేష్‌ నాయుడు మాట్లాడుతూ క్రమశిక్షణ, విలువలు కలిగి అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించే వారికి పార్టీలో ఎదుగుదల ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు మాట్లాడుతూ బీజేపీ అభిమానులు కార్యకర్తలుగా మారి నాయకులుగా ఎదగాలని అకాంక్షించారు.

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్‌రెడ్డి

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రాలయానికి చెందిన ఆయన గతంలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనను నేతలు, కార్యకర్తలు శాలువ కప్పి, పూలమాలలతో సన్నానించారు. కార్యక్రమంలో నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి, గీతామాధురి, వినూషరెడ్డి, అంకాల్‌రెడ్డి, కుర్ని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:43 AM