Share News

అదే దుస్థితి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:16 AM

అదే దుస్థితి

అదే దుస్థితి
కర్నూలు మార్కెట్‌ యార్డులో రూ.2 కోట్లు ఖర్చు చేసి అసంపూర్తిగా వదిలేసిన ఉల్లి శీతల గిడ్డంగులు

జిల్లాలోని మార్కెట్‌ యార్డుల్లో అసంపూర్తిగా నిర్మాణాలు

రూ. కోట్ల ప్రజాధనం నిరర్థకం

వైసీపీ హయాంలో ఐదేళ్లు నిర్లక్ష్యం

కూటమి ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పంట ఉత్పత్తుల క్రయ విక్రయాల ద్వారా ఏటా రూ. కోట్లలో ఆదాయం వస్తుంది. మార్కెట్‌కు వచ్చే రైతులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ షెడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. వీటికి రూ. కోట్లు వెచ్చించారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ కాలంలో ఐదేళ్లు అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పటికే ఖర్చు చేసిన రూ. కోట్ల ప్రజా ధనం నిరర్థకంగా మారింది. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా ఈ పది నెలల్లో అదే పరిస్థితి కొనసాగుతున్నది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డుల్లో అసంపూర్తిగా ఉన్న షెడ్లు, ఉల్లి శీతల గిడ్డుంగుల తాజా పరిస్థితిపై ఆంధ్రజ్యోతి కథనం.

కర్నూలు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్‌లు ఉన్నా.. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులు రోజువారి (రెగ్యులర్‌)గా పత్తి, ఉల్లి, మిరప, వేరుశనగ, వాము, కంది.. వంటి పంట ఉత్పత్తులు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. పత్తికొండ మార్కెట్‌ యార్డులో టమోటా సీజన్‌లో మాత్రమే టమోటా క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. ఆలూరు, మంత్రాలయం (కోసిగి), కోడుమూరు మార్కెట్‌లో పంట ఉత్పత్తులు విక్రయాలు జరగడం లేదు. ఆయా మార్కెట్లలో ప్రతి ఏటా సరాసరి రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు విలువైన పంట ఉత్పత్తులు రైతులు అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఒక శాతం మార్కెట్‌ సెస్సు రూపంలో ఈ ఏడాది రూ.39 కోట్లు ఆదాయం సమకూరింది. మార్కెట్‌కు పంట దిగుబడులు తీసుకొచ్చే రైతులకు మౌలిక వసతులు, పంట దిగుబడులు వర్షాలు, ఎండలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడం, గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవడానికి గోదాముల సౌకర్యం కల్పించే బాధ్యత మార్కెటింగ్‌ శాఖపై ఉంది.

వైసీపీ హయాంలో ఐదేళ్ల నిర్లక్ష్యం

రైతులు తీసుకొచ్చే పంట దిగుబడులు నిల్వ చేసుకోవడం, వర్షాలకు తడవకుండా, ఎండలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంగా 2018-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.14.50 కోట్లతో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డుల్లో ఉల్లి శీతల గిడ్డంగులు, జంబో షెడ్లు నిర్మాణాలు చేపట్టింది. దాదాపు రూ.6.30 కోట్లు వెచ్చించింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించకుండా అసంపూర్తిగా వదిలేసింది. ఇప్పటి దాకా ఖర్చు చేసిన రూ. కోట్ల ప్రజాధనం మట్టిపాలేనా..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అసంపూర్తిగా ఉల్లి శీతల గిడ్డంగులు

కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఏటా రూ.750-850 కోట్లు విలువైన వ్యవసాయ పంట దిగుబడులు రైతులు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఏటా రూ.7.50-8.50 కోట్లు ఆదాయం వస్తే.. అందులో. ఒక్క ఉల్లి అమ్మకాల ద్వారానే రూ.1.50 కోట్లు వస్తుంది. రాయలసీమలో ఏకైక ఉల్లి మార్కెట్‌ ఇది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు, సరిహద్దున తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఉల్లి దిగుబడులు తీసుకొస్తున్నారు. గిట్టుబాటు ధర లేక.. లారీ బాడుగులు కూడా గిట్టుబాటు కాక రైతులు ఉల్లిని రోడ్లపై పారబోసిన వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. మద్దతు ధర లేనప్పుడు ఉల్లి నిల్వ చేసి.. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి వీలుగా గత టీటీపీ ప్రభుత్వం నాబారు నిధులు రూ.5 కోట్లతో ఉల్లి శీతల గిడ్డంగుల నిర్మాణం చేపట్టింది. రూ.2 కోట్లు ఖర్చు చేశారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు కొనసాగించకపోగా ఎక్కడి పనులు అక్కడితో ఆపేయమని 2021-22లో ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 2025-26 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం బ్యాలెన్స్‌ పనులకు కోసం రూ.5 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం ఖజానాపై రూ.2 కోట్లు ఆదనపు భారం తప్పడం లేదు. కూటమి ప్రభుత్వమైన పూర్తి చేస్తుందా..? అన్నది ప్రశ్నార్థకమే.

భారీ షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యేనా..?

కర్నూలు మార్కెట్‌ యార్డులో వేరుశనగ, వాము, కంది, పప్పు శనగ.. వంటి పంట దిగుబడులు క్రయ విక్రయాల కోసం మార్కెట్‌ ఆఫీసుకు ఎదురుగానే రూ.2.50 కోట్లతో జంబో షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. 80 శాతం పూర్తి చేసినా డ్రైన్లు, సిమెంట్‌ ప్లాస్టింగ్‌.. వంటి పనులు ఆసంపూర్తిగా ఉన్నాయి.

రాయలసీమలోనే ఏకైక పత్తి మార్కెట్‌ ఆదోని. ఈ ఏడాది రూ.1,720 కోట్లకు పైగా విలువైన పత్తి, వేరుశనగ, వాము, కంది.. వంటి పంట దిగుబడులు రైతులు అమ్మకానికి తెచ్చారు. 6.50 లక్షల క్వింటాళ్లకు పైగా అమ్మకానికి వచ్చింది. అయితే.. పంట దిగుబడులు మార్కెట్‌ తెచ్చిన సమయంలో వర్షాలు రావడం, తడిసి పత్తి రంగు మారి నాణ్యత కోల్పోవడంతో ధరలు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. పత్తి పంట వానకు తడవకుండా ఉండేందుకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్లతో జంబో షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సివిల్‌ పనులకు సుమారుగా రూ.80 లక్షలు ఖర్చు చేశారు. పైన ఇనుప రేకులు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం రావడం రైతులకు శాపంగా మారింది. ఆరేళ్లుగా పిల్లర్లతో అసంపూర్తిగా ఆగిపోయింది.

ఎమ్మిగనూరు మార్కెట్‌లో వేరుశనగ, కంది, వాము, పప్పు శనగ.. వంటి పంట దిగుబడులు అమ్మకానికి రైతులు తెస్తున్నారు. ఈ ఏడాది రూ.8.40 కోట్లు సెస్సు రూపంలో ఆదాయం వచ్చింది. అంటే.. రూ.840 కోట్లు విలువైన పంట ఉత్పత్తులు క్రయవిక్రయాలు జరిగాయి. రైతు పంటలు వర్షాలకు తడవకుండా ఉండేందుకు రూ.2.50 కోట్లతో జంబో షెడ్డు నిర్మాణాలు చేపట్టారు. సీసీ ప్లాట్‌ఫారం, పిల్లర్లు వంటి పనులు చేసి దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. ఇనుప రేకులు ఏర్పాటు చేయాల్సి ఉండగా గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో అసంపూర్తిగా ఆగిపోయాయి.

ప్రభుత్వానికి నివేదిక పంపించాం

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి శీతల గిడ్డంగులు సహా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్లలో షెడ్లు నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న మాట నిజమే. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. పునఃనిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేశాం. మర్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు మొదలు పెడుతాం.

- నారాయణమూర్తి, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ, కర్నూలు

Updated Date - Apr 10 , 2025 | 12:16 AM