తడకనపల్లె రోల్ మోడల్
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:13 AM
కూటమి ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి వారిని లాభాలబాట పట్టించేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నది. రైతు లాభాల బాట పట్టాలంటే కేవలం వ్యవసాయం మాత్రమే సరిపోదని, ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక రాష్ట్రమంతటా పశువుల హాస్టళ్లు
ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒక పశు హాస్టల్
స్థలాల కోసం ప్రతిపాదనలు పంపాం : జేడీ హేమంత్ కుమార్
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి వారిని లాభాలబాట పట్టించేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నది. రైతు లాభాల బాట పట్టాలంటే కేవలం వ్యవసాయం మాత్రమే సరిపోదని, ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాడి పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించేందుకు చర్యలు చేపట్టింది. మూగ జీవాలకు నీడ కల్పించందుకు హాస్టళ్ల ఏర్పాటుకు సిద్ధమైంది. దశాబ్దం కిందటే కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో పాడిగేదెలకు హాస్టల్ నిర్వహణ పథకానికి బీజం వేయడంతో ఆ పథకాన్ని పొదుపులక్ష్మి గ్రూపుల మహిళలు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో తడకనపల్లెలో మాదిరి పాడిగేదెలకు హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ హాస్టల్ ఏర్పాటు కోసం విధి విధానాలను రూపొందించి వెంటనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలంటూ పశుసంవర్థ్దక శాఖ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా పశుసంవర్థక శాఖ కమిషనరేట్ నుంచి జిల్లా కేంద్రంలోని పశుసంవర్థకశాఖ జేడీ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఒక్కో హాస్టల్‌కు రూ.10 లక్షలు..
పాడి పరిశ్రమ అభివృద్ధికి గత టీడీపీ పాలనలో మెగా గోకులాల పేరిట షెడ్లు నిర్మించి రైతులకు చేయూత అందించారు. ఆ తర్వాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం వీటి నిర్వహణను పట్టించుకోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో పశువులకు వసతి గృహాలు నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. పశువుల సంరక్షణ, పోషణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10 లక్షల దాకా కేటాయించనున్నారు. ఒక్కో హాస్టల్‌లో 20 నుంచి 30 పశువులకు వసతి కల్పించనున్నారు. పాడిగేదెలకు అవసరమైన పశుగ్రాసాన్ని సమకూర్చడంతో పాటు వాటికి తాగునీరు, పాలు పితికేందుకు, పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముుక్కలు చేసేందుకు యంత్రాలను హాస్టల్‌లో ఏర్పాటు చేయనున్నారు. గేదెల పేడ నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల తయారీ పాల ఉత్పత్తితో రైతులకు ఆదాయం పెంచాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. ఈపశు హాస్టళ్ల నిర్వహణను పొదుపు లక్ష్మి గ్రూపు మహిళలకు, రైతుల సంఘాలకు అప్పగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయట వెళ్లిన రైతుల పశువులకు, పట్టణాల్లోని బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న పశువులకు హాస్టల్ ఏర్పాటు చేస్తారు. పశువులను రక్షించడానికి, అదే విధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఈ పశు హాస్టల్స్ ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు తెలిపారు.
ఉపాధి హామీ నిధులతో పశువులకు హాస్టళ్లు
జిల్లా నీటి యాజమాన్య సంస్థ నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు పశుసంవర్థకశాఖ జేడీ హేమంత్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పశు హాస్టల్‌ను ఏర్పాటు చేసేందుకు కనీసం పదెకరాల స్థలాన్ని కేటాయించాలంటూ రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని ఆయన సోమవారం విలేకరులకు తెలిపారు.
స్థలాల కోసం ప్రతిపాదనలు పంపాం
రైతులను పోషిస్తున్న మూగ జీవాలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక పశు హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయనున్నారు. ఒక్కో హాస్టల్‌కు దాదాపు పదెకరాల స్థలం అవుతుంది. విధి విధానాలను పూర్తిగా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలు చేస్తారు. ఇప్పటికే తాము అన్ని నియోజకవర్గాల్లో పశు హాస్టళ్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కేటాయించాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపంచాం. - హేమంత్ కుమార్, జేడీ