టీజీ ప్రధాన కాలువకు గండి
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:48 PM
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చాగలమర్రి మండలంలో డి. వనిపెంట గ్రామ సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ 84 కి.మీ సమీపంలో ప్రధాన కాలువ కుంగి శనివారం సాయంత్రం గండిపడింది.
84 కి.మీ వద్ద కుంగిన ప్రధాన కాలువ కట్ట
గండిపడ్డ చోట నుంచి వృఽథాగా పోతున్న నీరు
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
సహాయక చర్యలు చేపట్టాలంటూ ఎమ్మెల్యే ఆదేశం
చాగలమర్రి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చాగలమర్రి మండలంలో డి. వనిపెంట గ్రామ సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ 84 కి.మీ సమీపంలో ప్రధాన కాలువ కుంగి శనివారం సాయంత్రం గండిపడింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న టీజీపీ కాలువ ఒక్కసారిగా కుంగి గండిపడింది. గండిపడ్డ చోట నుంచి కాలువ నీరు దిగువ ప్రాంతానికి వెళ్తోంది. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం టీజీపీ కాలువ వద్దకు వెళ్లారు. తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎస్‌ఐ సురేష్, ఎంపీడీవో తాహిర్‌హుసేన్, తెలుగుగంగ, మైనర్ ఇరిగేషన్ ఏఈలు వినయ్, రాంప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గండిపడ్డ ప్రదేశాన్ని చూసి ప్రమాద తీవ్రతను అంచనా వేశారు. గండిపడ్డ ప్రదేశం నుంచి దిగువకు వెళ్తున్న నీటి వల్ల ప్రధానంగా ముంపుకు గురయ్యే తోడెండ్లపల్లె గ్రామానికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు. టీజీపీకి గండిపడటంతో నీరు పంట పొలాల్లో ప్రవహించి తోడేండ్లపల్లె గ్రామంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు. టీజీపీ ఏఈ వినయ్ తెలుగుగంగ ఎస్‌ఈతో చర్చించారు. తహసీల్దార్ విజయ్‌కుమార్, నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్‌తో మాట్లాడి వారి సూచనల మేరకు సహాయక చర్యలు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించి టీజీపీకి గండిపడ్డ ప్రదేశంలో తాత్కాలిక చర్యలు చేపట్టి ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులకు, టీడీపీ నాయకులకు ఆదేశించారు.