వెలుగోడులో ఉద్రిక్తత
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:27 PM
వెలుగోడు పట్టణంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం జరిగిన వినాయక నిమజ్జనంలో భాగంగా గణనాథులను జమ్మినగర్‌తండా సమీపంలో గాలేరు నదిలో నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్లలో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు.
వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ
రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు
తరలివచ్చిన హైందవ సంఘాల ప్రతినిధులు
పోలీస్‌స్టేషన్ ఎదుట 8గంటలు బైఠాయింపు
అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు
పరిస్థితిని పర్యవేక్షించిన డీఐజీ, ఎస్పీ
ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
వెలుగోడు పట్టణంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం జరిగిన వినాయక నిమజ్జనంలో భాగంగా గణనాథులను జమ్మినగర్‌తండా సమీపంలో గాలేరు నదిలో నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్లలో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఈక్రమంలోనే ఓ ప్రార్థనా మందిరం వద్ద డప్పులు వాయిస్తూ ఊరేగింపుగా వెళ్లేందుకు ఓవర్గం వారు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. హుటాహుటిన కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, జేసీ విష్ణుచరణ్, ఏఎస్పీ యుగంధర్ వెలుగోడుకు చేరుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఈక్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఓ వర్గానికి చెందిన వారంతా వినాయక విగ్రహాలను ట్రాక్టర్ ట్రాలీల్లోనే ఉంచి వాటిని ఎక్కడికక్కడే రోడ్లపై నిలిపివేసి ఇంజన్లను తీసుకెళ్లారు.
ఆత్మకూరు/ వెలుగోడు(ఆంధ్రజ్యోతి)
ఇతర గ్రామాల ట్రాక్టర్ ఇంజన్‌లను..
పోలీసులే స్వయంగా ఇతర గ్రామాల ట్రాక్టర్ ఇంజన్‌లను తెప్పించి ఆయా ట్రాలీల్లోని వినాయక విగ్రహాలను బోయరేవుల సమీపంలోని గాలేరు నదిలో శనివారం తెల్లవారుజామున నిమజ్జనం చేశారు. ఆతర్వాత ఆ ట్రాక్టర్ల ట్రాలీలన్నీ ఓ ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో నిలిపివేశారు. ఈ విషయం విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, వినాయక ఉత్సవ సమితిల దృష్టికి వెళ్లడంతో ఆయా సంఘాల నాయకులు వై.విష్ణువర్థన్‌రెడ్డి, చంద్రమౌళీశ్వరయ్య, కమ్మయ్య, భూమా రాజశేఖరరెడ్డి, చిలుకూరి శ్రీనివాసులు, నిమ్మకాయల సుధాకర్ ఉదయాన్నే వెలుగోడుకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ వినాయక మంటపాల నిర్వాహకులు, ఓవర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్థానిక పోస్టాఫీసు నుంచి పోలీసుస్టేషన్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. సుమారు 11గంటల సమయంలో పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎవరు అడ్డొచ్చినా తాము వినాయక విగ్రహాలకు నిమజ్జనం చేసి తీరుతామని భీష్మించారు. అయితే అనుమతులు ఇచ్చే అంశం తమ పరిధిలో లేదని జిల్లా కలెక్టర్, ఎస్పీలను సంప్రదించాలని స్థానిక పోలీసు అధికారులు వారికి చెప్పడంతో ఆయా సంఘాల ముఖ్య నాయకులు నంద్యాలకు బయలుదేరి వెళ్లారు. అయినప్పటికి ఓ వర్గానికి చెందిన ప్రజలు రాత్రి 7గంటల వరకు స్టేషన్ ఎదుటే ధర్నా కొనసాగించారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేయడంతో పాటు సాయంత్రం వర్షం దంచికొట్టిన అక్కడి నుంచి కదల్లేదు. ఈక్రమంలోనే నిమజ్జనం చేసి తీరుతామంటూ ఓ విగ్రహాన్ని ట్రాక్టర్‌లో పోలీసు స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. బీజేపీ నాయకులు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని సమస్య పరిష్కరం కోసం చర్చించారు.
భారీ బందోబస్తు మధ్య ఊరేగింపు
డీఐజీ కోయ ప్రవీణ్, నంద్యాల ఎస్పీ ఆధిరాజ్‌సింగ్ రాణా వెలుగోడుకు చేరుకుని డప్పు వాయిద్యాల నడుమ వినాయక ఊరేగింపునకు అనుమతించారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య వినాయక ఊరేగింపు కొనసాగించి జమ్మినగర్ తండా సమీపంలోని గాలేరు నదిలో నిమజ్జనం చేశారు. ఈ శోభాయాత్రకు వెలుగోడుతో పాటు ఇతర గ్రామాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. మొత్తానికి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులతో పాటు ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల అత్యుత్సాహంతోనే..
వెలుగోడులో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులు పోలీసుల అత్యుత్సాహంతోనే జరిగిందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం వెలుగోడుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడా రు. చట్టంలో ఎక్కడా ప్రార్థనా మందిరాల వద్ద మేళతాళాలు ఆపాలని లేదన్నారు. హిందూ సమాజం ఇతర మతాలను ఎప్పుడు గౌరవిస్తుం దని, వారి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిగించ కుండా గౌరవించే ఆచారాన్ని ఎప్పటికీ ఆచరిస్తామని గుర్తుచేశారు. ఇక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం సిగ్గుచేటని అన్నా రు. వీటిపై ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు గురికావొద్దని హెచ్చరించారు.