Share News

మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఉద్రిక్తత

ABN , Publish Date - May 31 , 2025 | 12:22 AM

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమా వేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఉద్రిక్తత
కౌన్సిల్‌ సమావేశం హాల్‌ ఎదుట బైఠాయించిన బీసీ సంఘాల నాయకులు

సమావేశం హాల్‌లోకి చొచ్చుకొచ్చిన బీసీ సంఘాల నాయకులు

శ్మశానంలో రోడ్డుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌

ఎమ్మిగనూరు, మే 30(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కౌన్సిల్‌ సమా వేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం మున్సిపల్‌ పురపాలక సంఘం సమావేశం మున్సిపల్‌ చైర్మన డాక్టర్‌ రఘు అధ్య క్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ శ్మశాన వాటిక మీదుగా 2023లో రోడ్డుకు కౌన్సిల్‌ ఇచ్చిన అనుమతులు రద్దుచేయాలని కోరుతూ బీసీ సంఘాల నాయకులు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లోకి చొచ్చుకువచ్చారు. అడ్డుకున్న మున్సిపల్‌ సిబ్బందిపై బీసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ శ్మశానవాటిక స్థలంలో రోడ్డుకు ఎలా అనుమతి ఇచ్చారని మున్సిపల్‌ చైర్మనను, సభ్యులను, అధికారు లను ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ చైర్మన రఘుకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే కమిషనర్‌ గంగి రెడ్డితో మాట్లాడేందుకు వెళ్లగా సమావేశం జరిగే సమయంలో లోపలకు రావటం తగదని బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం తరం పోలీసులు నాయకులను బలవంతంగా బయటకు పంపారు. సభ ప్రారంభంలో వైస్‌ చైర్మన నజీర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీకి స్పెషల్‌ గ్రేడ్‌ రావటంతో పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. బీసీ శ్మశానవాటిక మీదుగా రోడ్డుకు అప్పట్లో 17వ వార్డు ప్రజలు అధికారు లకు విన్నవించటంతోనే కౌన్సిల్‌లో తీర్మానం చేశారన్నారు. ఈ సందర్భం గా టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ దయాసాగర్‌ తీవ్రంగా ఆక్షేపించారు. రూ. లక్షల్లో ముడుపులు తీసుకొని ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు రోడ్డుకు 2023లో కౌన్సిల్‌ తీర్మానం చేశారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు కౌన్సిల్‌లో ప్రస్తావించినా పట్టించుకోలేదన్నారు. దయాసాగర్‌ మాట్లాడు తుండగా వైస్‌చైర్మన నజీర్‌ అడ్డుతగలడంతో, నజీర్‌ టీడీపీ సభ్యులు రామదాసు గౌడ్‌, ఇసాక్‌ , అమాన, వాహీద్‌ల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం చైర్మన రఘు స్పందిస్తూ బీసీ శ్మశానవాటిక స్థలంలో ఎవరికి రోడ్డు ఇస్తూ మ్యాప్‌ ఇవ్వలేదని, అదేవిషయాన్ని టీపీవో రాజేష్‌ తెలిపారు. ప్రస్తుతం కోర్టులో ఉందని తేలిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి మాట్లాడుతూ 2023లో అక్కడ రోడ్డు కావాలని ప్రజలు కోరటంతో కౌన్సిల్‌లో పెట్టామన్నారు. సమస్య కోర్టులో ఉందన్నారు.

ఫ మున్సిపల్‌ కౌన్సిల్‌లో వైసీపీ సభ్యులు బజారి మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో ఎవరిని అడిగి అజెండాలో పెడుతున్నారని ప్రశ్నించారు. మా వార్డులో 200 కుటుంబాలకు తాగునీరు అందటం లేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. అలాగే 22వార్డు వైసీపీ కౌన్సిలర్‌ కేశవరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్లగా గాంధీ నగర్‌లో సీసీ రోడ్డు వేయాలని కోరినా పట్టించుకోవటం లేదన్నారు. 2వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ అంపమ్మ మాట్లాడుతూ సార్‌.. మావార్డు ఏం పాపం చేసింది చెప్పండి.. మావార్డు ఊర్లో లేదా.. రోడ్లు వేయాలని వందసార్లు చెప్పినా పట్టించుకోరా అంటు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 6వార్డు వైసీపీ కౌన్సిలర్‌ శివకుమార్‌ మాట్లాడుతూ బీసీ స్మశానవాటిక సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. అలాగే వార్డులో అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఈలు నీరజ, నాయక్‌, టీపీఓ రాజేష్‌, కౌన్సిలర్లు రామదాసు గౌడ్‌, కాశీం బేగ్‌, రాజరత్నం, ఇసాక్‌, అమాన, వాహీద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 12:22 AM