Share News

‘తొలి అడుగు’లో ఉద్రిక్తత..!

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:46 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తొలి అడుగు’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీశైలం నియోజకవర్గ కేంద్ర బిందువైన ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

‘తొలి అడుగు’లో ఉద్రిక్తత..!
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వాహనాన్ని చుట్టుముటిన టీడీపీ శ్రేణులు

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిపై దాడి

ఇంటి అద్దాలు ధ్వంసం

ఎంపీ బైరెడ్డి శబరి వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

ఆత్మకూరులో టెన్షన్‌.. టెన్షన్‌

ఆత్మకూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తొలి అడుగు’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీశైలం నియోజకవర్గ కేంద్ర బిందువైన ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక టీడీపీ శ్రేణులు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పర్యటనను అడ్డుకున్నారు. అదేక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడంతో ఆయనపై భౌతికదాడికి పాల్పడ్డారు. వివరాలు.. ఆత్మకూరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో దివ్యాంగులకు పరికరాల పంపిణీకి సంబంధించి రిజిస్ర్టేషన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరుకు వస్తుండటంతో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆత్మకూరులోని తన నివాసంలో ఉదయం అల్పహారాన్ని ఆహ్వానించారు. దీంతో ఆమె అక్కడికి వెళ్లి అల్పహారం అనంతరం అదేకాలనీలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పర్యటన చేపట్టారు.

ఎమ్మెల్యేకు సమాచారమివ్వకుండా..

‘తొలి అడుగు’లో భాగంగా నాలుగైదు ఇళ్లు పర్యటించేలోగా టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు రవీంద్రారెడ్డి, వేణుగోపాల్‌, నాయకులు శివప్రసాద్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, మల్లికార్జునరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాగూర్‌ఖాన్‌, షాబుద్దిన్‌, వెంకటరావు అక్కడికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న తమకు, ఎమ్మెల్యేకు కనీస సమాచారమివ్వకుండా ‘తొలి అడుగు’ను ఎలా నిర్వహిస్తారంటూ ఎంపీని నిలదీశారు. ఇందుకు ఎంపీ శబరి స్పందిస్తూ ‘తొలి అడుగు’లో పాల్గొనాలని పార్టీ ఆదేశించిందని, ఎలాగూ ఖాళీగా ఉన్నా కదా అన్నట్లుగా కొన్ని ఇళ్లకైనా పర్యటిద్దామని వెళ్లినట్లు సమాధానం ఇచ్చారు. తాను ఎంపీనని పార్లమెంట్‌ పరిధిలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకుందని చెప్పుకొచ్చారు. మాటామాటా పెరిగి ఎమ్మెల్యే లేకుండా ఎలా వెళ్తారంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నించడంతో ఆమె తన పర్యటనను మధ్యలో వదిలేసి వెనుదిరిగారు. ఆమె తన వాహనంలోకి ఎక్కి ఎమ్మెల్యే బుడ్డాతో మాట్లాడి జరిగిన విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. ఎంపీ శబరి, మాజీ మంత్రి ఏరాసు గోబ్యాక్‌.. గోబ్యాక్‌ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఆతర్వాత అమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మాజీ మంత్రికి రక్తగాయాలు

ఎంపీ బైరెడ్డి శబరి అక్కడి నుంచి వెళ్లగానే.. అక్కడున్న టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మాజీ మంత్రి ఏరాసుకు చిన్నపాటి రక్తగాయాలయ్యాయి. ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈక్రమంలోనే అర్బన్‌ సీఐ రాము వెంటనే మాజీ మంత్రి ఏరాసు, ఆయన అనుచ రులను ఇంట్లోకి పంపేంచేసి టీడీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. శ్రీశైల నియోజకవర్గం టీడీపీలో మాజీ మంత్రి ఏరాసు వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత అక్కడికి ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్‌, రూరల్‌ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి చేరుకుని అక్క డున్న వారిని చెదరగొట్టారు. ఆ వెంట నే ఏరాసును పోలీసులు బందోబస్తు నడుమ నంద్యాలకు తరలించారు.

ఎంపీడీవో కార్యాలయం వద్ద..

ఆత్మకూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీ బైరెడ్డి శబరిని ఎంపీడీవో కార్యాలయంలో జరిగే దివ్యాంగులకు పరికరాల పంపిణీకి సంబం ధించిన రిజిస్ర్టేషన్‌ కార్యక్రమానికి కూడా అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయ త్నించారు. కొంతమంది మహిళా కార్యకర్తలతో కలిసి అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈక్రమంలోనే అక్కడ జరిగే అధికారుల ప్రసంగాలను త్వరిగితన ముగించేసి సమావే శాన్ని పూర్తిచేసినట్లు తెలిసింది. బీజేపీ నాయకులు మోమిన్‌ షబానా ఎంపీ శబరిని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించడంతో ఆమె అక్కడికి వెళ్లారు. దీంతో చివరకు పోలీసులు ఎంపీ శబరి నచ్చజెప్పడంతో ఆమె నంద్యాలకు వెళ్లిపోయారు. ఒకానొక సమయం లో శబరిని అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న పాములపాడు, కొత్తపల్లి మండలాలకు చెందిన ఆమె అనుచరులు ఆత్మకూరుకు వచ్చే ప్రయత్నం చేశారు. వారికి పోలీసులు సర్ధిచెప్పినట్లు సమాచారం. ఏదీఏమైనా ‘తొలి అడుగు’తో ఆత్మకూరులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

అపార్థం వల్లే సమస్య

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి

ఆత్మకూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): అపార్థం చేసుకోవడం వల్లే ఆత్మకూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన సమస్య ఉత్పన్నమైందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆత్మకూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి నారాలోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లాలో అనేక మంది దివ్యాంగులు తమకు తోపుడుబండ్లు, మోటారు సైకిళ్లు కావాలని అభ్యర్థిం చినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తాము అధికారంలోకి వస్తే.. దివ్యాంగులందరికి పరికరాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చానట్లు చెప్పారు. అయితే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం, అలెన్‌కో సంస్థ సహకారంతో నంద్యాలలో మాత్రమే దివ్యాంగులకు పరికరాల పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డితో తాను హాజరయ్యేందుకు ఆత్మకూరుకు వచ్చానని అన్నారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి బ్రేక్‌ఫాస్ట్‌కు పిలవడంతో మర్యాదపూర్వకంగా ఆయన ఇంటికి వెళ్లాలని చెప్పారు. ఆక్రమంలోనే అనవసరమైన అపార్థం చేసుకోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని వివరించారు.

Updated Date - Jul 04 , 2025 | 11:46 PM