వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:27 PM
: పట్టణ శివారులోని అరేకల్లు గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది.
విద్యార్థి సంఘాల ముట్టడికి యత్నం
అడ్డుకున్న పోలీసులు
విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట
సీఐ, ఎస్‌ఐకి గాయాలు
ఆదోని అగ్రికలర్ / రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : పట్టణ శివారులోని అరేకల్లు గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మెడికల్ కళాశాల భవనాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. అప్పటికే కూటమి నాయకులు వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మెడికల్ కళాశాలను పరిశీలించేందుకు వెళ్లారు. విద్యార్థులకు, కూటమి నాయకులకు మధ్య ఘర్షణ తలెత్తుతుందని అక్కడికి వెళ్తున్న వారిని మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఇస్వీ పోలీస్‌స్టేషన్ ఎస్సై నాయక్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు కొద్దిసేపు ఇక్కడే ఉండాలని, కూటమి నాయకులు వెళ్లారని నచ్చజెప్పారు. కూటమి నాయకులకు అనుమతి ఇచ్చి మాకేందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ఎంతసేపైనా ముందుకు కదలనివ్వకపోవడంతో మెడికల్ కళాశాల భవనం ముట్టడికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తాలూకా సీఐ నల్లప్ప, ఎస్సైలు నాయక్, రామాంజులు, పోలీసులు బలవంతంగా విద్యార్థులను, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను స్టేషన్‌కి తరలించే ప్రయత్నం చేయగా వారు తిరగబడ్డారు. పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. బలవంతంగా విద్యార్థి సంఘ నాయకులను వాహనంలోకి ఈడ్చికెళ్లారు. తోపులాట మధ్య తాలూకా పోలీస్‌స్టేషన్ సీఐ నల్లప్ప, ఇస్వీ పోలీస్ స్టేషన్ ఎస్సై డాక్టర్ నాయక్‌కు చేతులకు, మోచేతికి గాయాలయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షు డు రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లానాయకుడు రవితో పాటు మరికొంత మందిని తాలూకా స్టేషన్‌కు తరలించారు.
ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై కేసు నమోదు
ప్రభుత్వ మెడికల్ కళాశాల ముట్టడికి వెళ్లిన 9 మంది ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై గురువారం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కురువ శ్రీనివాసులు, రంగప్ప, సాయి ఉదయ్, విజయ్ కుమార్, విల్సన్, చాకలి రావు, దేవానస్, మీరాజ్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ నల్లప్ప తెలిపారు.