ఆలయాలే టార్గెట్‌గా..
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:29 AM
ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. మండలంలో మంగళవారం వేకువజామున దొంగలు హల్‌చల్ చేశారు. రోడ్డుపక్కన ఉన్న ఆలయాలను టార్గెట్ చేసి భక్తులు సమర్పించిన ముడుపులను అపహరించినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.
హల్‌చల్ చేసిన దొంగలు
తాళాలు పగలగొట్టారు
హుండీలు ఎత్తుకెళ్లారు
పోలీసుల ముమ్మర గాలింపు
గడివేముల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. మండలంలో మంగళవారం వేకువజామున దొంగలు హల్‌చల్ చేశారు. రోడ్డుపక్కన ఉన్న ఆలయాలను టార్గెట్ చేసి భక్తులు సమర్పించిన ముడుపులను అపహరించినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. వివరాలు.. వేకువజామున కొందరు దుండగలు బోలెరో వాహనంలో వచ్చి బూజనూరులో రోడ్డు పక్కన ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయ గేటుకు ఉన్న తాళాన్ని పగలగొట్టారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. నందికొట్కూరు రహదారిలో వెళ్తూ గడివేములలో రోడ్డుపక్కన ఉన్న నూతన మూలపెద్దమ్మ ఆలయంలో ఇదే తరహా దోపిడీకి పాల్పడ్డారు. ఆలయంలో హుండీని ఎత్తకెళ్లడానికి ప్రయత్నించారు. హుండీ బరువుగా ఉండటంతో ఆలయంలో నుంచి బయటకు ఇడ్చూకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఆలయం ముంగిట భక్తులు సమర్పించిన నాణేలు పడిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి పూజలు చేసేందుకు ఆలయ అర్చకుడు వచ్చారు. ఆలయం ముంగిట నాణేలు పడిఉండటాన్ని గమనించారు. ఆలయంలోకి ప్రవేశించగా హుండీని ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను పిలిపించి ఆనవాళ్లను సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించి దుండగలు వినియోగించిన వాహనాలను, వారు వెళ్లిన దారిని గుర్తించారు. ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి బూజనూరు గ్రామ శివారులో పడవేసిన వేంకటేశ్వరస్వామి ఖాళీ హుండీని, గడివేముల గ్రామ శివారులో మూలపెద్దమ్మ ఆలయ హుండీని గుర్తించారు. మూలపెద్దమ్మ ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన నాణేలు, అమ్మవారికి సమర్పించిన వెండి ఆభరణాలు దొంగలు వదిలి వెళ్లినట్లు గుర్తించారు. మూలపెద్దమ్మ పూజారి చిన్నమాచర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మూలపెద్దమ్మ ఆలయంలో సుమారు రూ.1.50 లక్షలు, బూజనూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.30 వేలను దుండగలు అపహరించారని భక్తులు చర్చించుకుం టున్నారు.
రెండు హుండీలు పగలగొట్టి..
మంత్రాలయం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వగరూరు గ్రామంలో వెలసిన భీర లింగేశ్వరస్వామి, వీర నాగప్ప దేవాలయాల్లో రెండు హుండీలు గుర్తు తెలియని వ్యక్తులు పగలకొట్టి నగదు, వెండి, మైక్ సెట్, ఇతర సామగ్రిని దోచుకెళ్లారు. ఈ చోరీ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని గ్రామస్థులు తెలుపుతున్నారు. గ్రామస్థులు, మంత్రాలయం పోలీసులు తెలిపిన వివరాలివీ.. భీర లింగేశ్వరస్వామి ఆలయంలో 50 కేజీల బరువున్న హుండీని ఎత్తుకెళ్లారు. దాదాపు హుండీలో రూ.50వేల నుంచి రూ.90వేల వరకు ఉండవచ్చని, ఈ హుండీని ప్రతి ఏడాది విజయదశమికి లెక్కిస్తామని భక్తులు చెబుతున్నారు. వీర నాగప్ప స్వామి ఆలయంలో హుండీని పగలకొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ప్రతి ఏడాది ఈ హుండీని లెక్కింపు మహాశివరాత్రి రోజున లెక్కింపు చేపడుతారని, ఇందులో రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు నగదు వస్తుందని తెలిపారు. మైకు సామగ్రి, మొక్కుబడుల కింద వచ్చిన వెండి, వివిధ ఆభర ణాలు సైతం అపహరించుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం ఆలయ పూజారులు వీరనాగుడు, రామాం జనేయులు దేవాలయం తలుపులు పగులకొట్టి ఉండటం చూసి మంత్రాలయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంత్రాలయం సీఐ రామాంజులు, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కర్నూలు నుంచి వచ్చిన క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. పూజారులు, సర్పంచ్ లింగారెడ్డి ఫిర్యాదు మేరకు రెండు హుండీల చోరీపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.