ఉబికి వస్తున్న కన్నీళ్లు!
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:07 AM
మా రైతుల కష్టాలు ఏమని చెప్పమంటా రు సారు..!
రోజుల తరబడి మార్కెట్‌లోనే ఉల్లి
అమ్ముకోలేకపోతున్న అన్నదాత
కనీస ఖర్చులు కూడా రాని ధైన్యం
మా రైతుల కష్టాలు ఏమని చెప్పమంటా రు సారు..! అప్పులు చేసి లక్షల రూపాయలు మట్టిలో పోశాం.. రేయింబవళ్లు కష్టపడి పండించిన ఉల్లి పంట అమ్ముదామని మార్కెట్‌కు వస్తే కొనేనాథుడే లేడు. రెండురోజుల నుంచి మార్కెట్లోనే ఉన్నాం.. అన్నం తిందామంటే పోవట్లేదు.. ఖర్చులకు కూడా జేబులో చిల్లిగవ్వలేదు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి కొంత ఊపిరి పోసినా.. ఆ డబ్బు ఎప్పుడు వస్తుందో తెలవదు. రవాణా, హమాలీ ఖర్చులు మేమే పెట్టాలి.. రైతుగా పుట్టడం మేము చేసుకున్న పాపమా..? ఓ బస్తా ఉల్లిగడ్డలు తీసుకొని ఓ పూట అన్నం పెట్టమన్నా పెట్టేవాళ్లు లేరు.. అప్పుల పాలయ్యాం. భార్య, బిడ్డలను తలుచుకుంటే కన్నీళ్లు ఉబికిఉబికి వస్తున్నాయి..! సి.బెళగల్ మండలం తిమ్మందొడ్డికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు కన్నీటి వేదన ఇది. ఒక్క వెంకటేశ్వర్లుదే కాదు సగటు ఉల్లి రైతు గుండెకోత ఇది. కర్నూలు మార్కెట్‌లో ఉల్లి రైతులను ఎవ రిని కదిపినా కన్నీటి సుడులే. బుధవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ మార్కెట్‌యార్డుకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలనలో కష్టజీవుల కన్నీటి కష్టాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి.
కర్నూలు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యధికంగా ఉల్లి సాగు చేస్తున్నా జిల్లాల్లో కర్నూలు ఒకటి. రాయలసీమ జిల్లాల్లో అతిపెద్ద ఉల్లి మార్కెట్ కూడా కర్నూలే. జిల్లాలో 31 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు 80 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా. పంటకోత సమయంలో అదిక వర్షాలకు పంట దెబ్బతినడంతో 45-50 క్వింటాళ్లకు మించి రావడం లేదు. ఈ లెక్కన జిల్లాలో ఒక్కటే 15.50 లక్షల క్వింటాళ్లు (1.55 లక్షల మెట్రిక్ టన్నులు) దిగుబడి వస్తుందని అంచనా. గతేడాది క్వింటా రూ.5 వేల వరకు పలికితే, తాజాగా క్వింటా వంద, రెండొందలు రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వివిధ గ్రామాల్లో పలువురు రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధర రూ.1,200లకు కొనుగోలు చేస్తుండడంతో కూలీ, రవాణా ఖర్చులైనా వస్తాయని మార్కెట్‌కు తెస్తున్నారు. బుధవారం 14,896 క్వింటాళ్లు ఉల్లి మార్కెట్‌కు వచ్చింది. ఏపీ మార్క్‌ఫెడ్ 6,431 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే, వ్యాపారులు 8,465 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. రాత్రి 10.30-11 గంటల వరకు తూకాలు, రవాణా కొనసాగింది. పంట తూకాలు వేసే వరకు రైతులు బస్తాలపైనే కూర్చొక తప్పలేదు. బయటకు వెళితే బస్తాలు మాయం చేస్తారని భయం వెంటాడుతుంది.
అన్నీ రైతులే భరించాలి
ఉల్లి దిగుబడులు ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసినా, ఖాళీ సంచులు, గడ్డలు దింపడం, తూకం వేసే హమాలీ ఖర్చులు సహా చివరికి సంచులు కుట్టేందుకు పురికోసం కూడా రైతులే భరించాలి. పెట్టుబడి, నాలుగు నెలలు భార్యపిల్లల కష్టం కాదని, చేతికొచ్చాక పంట కోతకు కూలీల ఖర్చు ఎకరాకు రూ.20 వేలు వస్తుంది. ఉల్లి మార్కెట్‌కు తీసుకురావాలంటే బస్తాకు రూ.50 రవాణా భరించాలి. పంట గ్రేడింగ్, పొలంలో ట్రాక్టర్‌కు లోడ్ చేసేందుకు బస్తాకు రూ.50కు పైగా వస్తోంది. ఎకరాకు వంద బస్తాలు దిగుబడి వస్తే పంట కోత, గ్రేడింగ్, రవాణా ఖర్చులు కలిపి రూ.30-35 వేలు ఖర్చు వస్తుంది. ఈ ఖర్చులు కాదని మార్కెట్‌కు వచ్చిన ఉల్లి ప్లాట్‌ఫాంలో దింపేందుకు, కాటా వేసేందుకు హమాలీ బస్తాకు రూ.50, ఖాళీ సంచి రూ.9, సంచులు కుట్టేందుకు తాడు కిలో రూ.150 కలిపితే వంద బస్తాలకు రూ.6,050కు పైగా రైతులే భరించాల్సి ఉంటుంది. ఏపీ మార్క్‌ఫెడ్ క్వింటా రూ.1,200కు కొనుగోలు చేస్తుందే తప్పా ఖాళీ సంచులు, హమాలీ ఖర్చులు ఒక్కపైసా భరించదు.
రూ.10.94 కోట్లు చెల్లించాలి
ఏపీ మార్క్‌ఫెడ్ 6,057 మెట్రిక్ టన్నులు (60,570 క్వింటాళ్లు) కొనుగోలు చేసింది. క్వింటా రూ.1,200 ప్రకారం రూ.7.26 కోట్లు రైతులకు చెల్లించాలి. ఇప్పటి వరకు రూ.1.54 కోట్లు మాత్రమే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. రూ.5.72 కోట్లు బకాయి ఉంది. వ్యాపారులు కొనుగోలు చేసిన ధరపై వ్యత్యాసం 6,202 టన్నులకు మరో రూ.5.22 కోట్లు కలిపి రూ.10.94 కోట్లు ఉల్లి రైతులకు చెల్లించాల్సి ఉంది. బుధవారం కొనుగోలు చేసిన 14,896 క్వింటాళ్లకు రూ.1.78 కోట్లు కలిపితే రూ.12.72 కోట్లు ఉల్లి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
తాడు కూడా మేమే కొనాలి
ఎకరం పొలంలో ఉల్లి సాగు చేశాను. రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. వంద బస్తాలు దిగుబడి వచ్చింది. పొలంలోనే వదిలేద్దామని అనుకున్నాను. ప్రభుత్వం కొంటుందని మార్కెట్‌కు తెచ్చాను. పంట కోత, రవాణా ఖర్చులే రూ.35 వేలు అయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు చేసినా హమాలీ ఖర్చులు సహా తాడు కూడా మేమే కొని ఇవ్వాలి. ప్రభుత్వం కొనడం వల్ల కొంత ఊపిరి నిలిపింది. పడేయలేక మార్కెట్‌కు తెచ్చాం. ఉల్లిగడ్డలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.
- రాఘవేంద్ర, ఉల్లి రైతు, తిమ్మందొడ్డి, సి.బెళగల్ మండలం
ఫ 20 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
మూడు ఎకరాలకు కౌలుకు చేశాను. ఎకరన్నర పొలంలో ఉల్లి వేశాను. రూ.1,50 లక్షలు అప్పు చేసి మట్టిలో పోశాను. అధిక వర్షాలకు పంటదెబ్బతిని 90 బస్తాలే దిగుబడి వచ్చింది. ప్రభుత్వం రూ.1,200కు కొనుగోలు చేసినా వెంటనే డబ్బులు ఇవ్వడం లేదు. హమాలీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. 20 ఏళ్లుగా ఉల్లి సాగు చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఎన్నడు చూడలేదు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే పురుగుమందే శరణ్యం. పెట్టుబడి, భార్యపిల్లల కష్టం మట్టిపాలైంది.
- వెంకటేశ్వర్లు, కౌలు రైతు, తిమ్మందొడ్డి, సి.బెళగల్ మండలం
బువ్వ తిందామన్నా పోవట్లేదు
మా కష్టం ఏమని చెప్పేది. రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉల్లిసాగు చేస్తే 250 బస్తాలు (125 క్వింటాళ్లు) దిగుబడి వచ్చింది. మంగళవారం మార్కెట్‌కు వచ్చాం. వ్యాపారులు కొనడం లేదు. ప్రభుత్వం కొన్నా అన్ని ఖర్చులు మేమే భరించాలి. అప్పులు, భార్యపిల్లలను తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఉదయం నుంచి అన్నమే తినలేదు. బువ్వ తిందామన్నా పోవట్లేదు. మా రైతులు కష్టాలు తీర్చేవారేవరు..?
- రాముడు, ఉల్లి రైతు, గుండ్రేవుల గ్రామం, సి.బెళగల్ మండలం