ఉపాధ్యాయుల విజయవాడ బాట
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:05 AM
సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన విధంగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసి నిరుద్యోగుల కలలను సాకారం చేశారు.
రేపు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
కర్నూలు నుంచి 134 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు
ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు 1నుంచి 124 నెంబరు గలవి..
నాల్ లోకల్ వారికి 125 నుంచి 133 నెంబరు వరకు..
సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన విధంగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసి నిరుద్యోగుల కలలను సాకారం చేశారు. 2025 ఏప్రిల్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబరు 15న తుది జాబితా విడుదల చేశారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా రేపు విజయవాడలో మధ్యాహ్నం 2గం టలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయ నున్నారు. విజయవాడకు వెళ్లేందుకు ప్రభుత్వమే 134 ఆర్టీసీ బస్సులను ఉమ్మడి జిల్లాలకు కేటాయించారు. ఈ బస్సుల ద్వారా అభ్యర్థులు విజయవాడకు చేరుకుంటారు.
కర్నూలు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోనే డీఎస్సీని నిర్వహించి తక్కువ కాలంలోనే పలితాలు ప్రకటించారు. మెగా డీఎస్సీ ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,678 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో అన్ని కేటగిరీల్లో కలుపుకుని 2590 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. మరో 88 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో 88 ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోయాయి. వచ్చే ఏడాది నిర్వహించే డీఎస్సీలో మిగిలిపోయిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ జిల్లా పరిషత్ యాజమాన్యం విభాగంలో అన్ని కేటిగిరిలో 2,547 పోస్టులకు గానూ 2483 పోస్టులు భర్తీ కాగా, 64 పోస్టులు మిగిలిపోయాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యం విభాగంలో 58 పోస్టులకు గానూ 51 భర్తీ కాగా, 7 పోస్టులు మిగిలాయి. మున్సిపల్ యాజమాన్యం విభాగంలో 40 పోస్టులకు గానూ 28 పోస్టులు భర్తీ కాగా, 12 పోస్టులు, ట్రైబల్ యాజమాన్యం విభాగంలో 33 పోస్టులకు గానూ 28 భర్తీ కాగా, 5 పోస్టులు అర్హత గల అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిపోయాయి.
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 19న విజయవాడలో మధ్యాహ్నం 2గంటలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయ నున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విదంగా ఒక వేడుకలా నిర్వహించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్నీ ఏర్పాట్లుచేస్తున్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలన చేసుకున్న రాయల సీమ విశ్వవిద్యాల యంలో గురువారం ఉదయం 8 గంటల్లోపు అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వమే ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులు 134 ఉమ్మడి జిల్లాలకు కేటాయిం చారు. ఈ బస్సుల ద్వారా అభ్యర్థులు విజయవాడకు చేరుకుంటారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో..
అభ్యర్థులందరిని కోఆర్డినేషన్ చేసేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలను, ఉప విద్యాశాఖ అధికారులను లైజన్స్ ఆఫీసర్లుగానూ, నోడల్ ఆఫీసర్‌గా నియమిం చింది. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు బస్సులను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులకు అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు స్నాక్స్‌ను స్వీకరించి తిరిగి కర్నూలు చేరే వరకు ఏర్పాటు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిసౌకర్యాలు ఏర్పాటుచేసినట్లు కర్నూలు డీఈవో అధికారి శామ్యూల్‌పాల్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు నంబర్ 1 నుంచి 124 వరకు ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు, 125 నుంచి 133 నెంబరు వరకు గల బస్సులను నాన్ లోకల్ కేటగిరి అభ్యర్థులకు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
అన్ని ఏర్పాట్లు చేశాం: ఇన్‌చార్జి కలెక్టర్ నవ్య
కర్నూలు కలెక్టరేట్: రేపు విజయవాడకు బయలుదేరే డీఎస్సీ ఉపాధ్యాయుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ నవ్య తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. కర్నూలు జిల్లా తరుపున చేసిన ఏర్పాట్లపై ఇన్‌చార్జి కలెక్టర్ డా.బి.నవ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. గురువారం ఉదయం ఉపాధ్యాయులు అల్పాహారం అనంతరం ఉదయం బయలు దేరుతారని, వారికి మార్గమధ్యలో భోజనం ఏర్పాటు చేశామన్నారు. రాత్రికి గుంటూ రులో బస ఉంటుందని తెలిపారు.