నేడు టీడీపీ ‘త్రీమెన్ కమిటీ’ రాక
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:23 PM
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారోనన్న ఉత్కంఠ ఆ పార్టీలో ప్రధానంగా మారింది. జిల్లా కమిటీ కూర్పు కోసం పార్టీ అధిష్ఠానం నియమించిన త్రీమెన్ కమిటీ మంగళవారం జిల్లాకు రానుంది.
టీడీపీ శ్రేణులు, నేతల నుంచి అభిప్రాయ సేకరణ
కర్నూలు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారోనన్న ఉత్కంఠ ఆ పార్టీలో ప్రధానంగా మారింది. జిల్లా కమిటీ కూర్పు కోసం పార్టీ అధిష్ఠానం నియమించిన త్రీమెన్ కమిటీ మంగళవారం జిల్లాకు రానుంది. తనిష్క్ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సంస్థాగత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్లమెంట్ పార్టీ, తెలుగు మహిళా, తెలుగురైతు, తెలుగు విద్యార్థి, టీఎన్‌టీయూసీ.. వంటి 17 అనుబంధ సంఘాలకు నూతన కమిటీలు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా కమిటీల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధినేత భావిస్తున్నారు. ఈ క్రమంలో త్రీమెన్ కమిటీ సభ్యులైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబులు జిల్లాకు రానున్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి అధినేత చంద్రబాబుకు నివేదిక పంపుతారు. ఇదిలా ఉండగా పదేళ్ల తరువాత కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చేలా ఎంపిక ఉండబోతోంది. 1995లో మొదటి సారిగా చంద్రబాబు పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 30 ఏళ్లుగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తారు. మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే తాజాగా పార్లమెంట్ కమిటీ ఎన్నిక కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కింద స్థాయి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని జిల్లా అధ్యక్ష, కార్యవర్గం ఎంపిక జరిగేది. అయితే గత 10-15 ఏళ్ల నుంచి అధిష్టానమే ఎంపిక చేస్తూ వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే పార్లమెంట్ కమిటీ ఏర్పాటుకు అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై ఆ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు ఎవరికి వారు తమ అభిప్రాయాలను బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. త్రీమెన్ కమిటీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.