Share News

అవిశ్వాసంలో నెగ్గిన టీడీపీ

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:10 PM

: కర్నూలు మండల ఎంపీపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఎట్టకేలకు టీడీపీ నెగ్గింది. దీంతో కర్నూలు ఎంపీపీ పీఠంపై పసుపు జెండా ఎగిరింది.

అవిశ్వాసంలో నెగ్గిన టీడీపీ
అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న ఎంపీటీసీలు

కర్నూలు ఎంపీపీ పీఠంపై పసుపు జెండా

త్వరలోనే మండల అధ్యక్షుడి ఎన్నిక

గైర్హాజరైన ఆరుగురు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు

చక్రం తిప్పిన విష్ణు, బొగ్గుల

ఇక నుంచి ఎంపీటీసీగా వెంకటేశ్వరమ్మ

మినిట్స్‌ బుక్కులో పొందుపరిచిన ఆర్డీవో

కర్నూలు రూరల్‌ డిసెంబంరు 2(ఆంధ్రజ్యోతి): కర్నూలు మండల ఎంపీపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఎట్టకేలకు టీడీపీ నెగ్గింది. దీంతో కర్నూలు ఎంపీపీ పీఠంపై పసుపు జెండా ఎగిరింది. తెలుగు తమ్ముళ్లు, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మంగళవారం కర్నూలు ఆర్డీవో కిడారి సందీప్‌కుమార్‌ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్‌ ఆవరణలోని మండల ప్రజా పరిషత్‌ సమావేశ భవనంలో వైసీపీ ఎంపీపీ వెంకటేశ్వరమ్మపై గతంలో టీడీపీ ఎంపీటీసీలు కలిసి ఇచ్చిన వినతిపత్రం మేరకు ఆర్డీవో అవిశ్వాస తీర్మానం గురించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కర్నూలు మండలంలో మొత్తం 19మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఈ సమావేశానికి 13మంది టీడీపీ ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. మిగిలిన ఆరుగురు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ ప్రత్యేక సమావేశం ఉదయం 11-45 గంటలకు ప్రారంభమై, కర్నూలు మండల ఎంపీపీ వెంకటేశ్వరమ్మపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కాపీని ఆర్డీవో సభ్యులకు చదివి వినిపించారు. వెంటనే వైసీపీకి చెందిన ప్రసుత ఎంపీపీ వెంకటేశ్వరమ్మ తమకొద్దని, ఆమె ఎన్నికను వ్యతిరేకిస్తున్నట్లు 13 మంది టీడీపీ ఎంపీపీటీసీ సభ్యులు చేతులెత్తి ప్రకటించారు. కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌ వెంకటరమేష్‌బాబు, ఎంపీడీవో రఘునాథ్‌ కలిసి చేతులెత్తిన సభ్యుల వివరాలను రికార్డులో పొందుపరిచారు. 13మంది ఎంపీటీసీ సభ్యులు కోరిక మేరకు వారి తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు కర్నూలు ఆర్డీవో ప్రకటించారు. ఇక నుంచి కర్నూలు ఎంపీపీ వెంకటేశ్వరమ్మ ఉల్చాల గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాత్రమేనని ఆయన తెలిపారు. మొత్తం 19మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఆరుగురు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరుకానందున సమావేశంలో ఉన్నవారిలో రెండు బై మూడో వంతు ప్రకారం 13మంది ఎంపీటీసీలతో కోరం సంపూర్ణంగా ఉన్నట్లు వివరించారు. 13మంది సభ్యుల తీర్మానాన్ని ఆమోదిస్తూ పంచాయతీ మినిట్స్‌ బుక్కులో ఆర్డీవో నమోదు చేశారు. రెండో పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

త్వరలోనే కొత్త ఎంపీపీ ఎన్నిక

ఉల్చాల ఎంపీటీసీ సభ్యురాలు డి. వెంకటేశ్వమ్మకు ఎంపీపీ పదవిని రద్దు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. అవిశ్వాస తీర్మానంలో మెజార్టీ సభ్యులు ఆమెను వ్యతిరేకించారని వివరించారు. ఈ తీర్మానం కాపీని జడ్పీ సీఈవో, కలెక్టర్‌కు పంపనున్నారు. అక్కడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపి ఆయన పరిశీలించిన అనంతరం ప్రిన్సిపల్‌ అనుమతితో కొత్త ఎంపీపీ ఎన్నికకు గడువును నిర్ణయిస్తారు. కాగా మండల అధ్యక్షుడి ఎవరనేది ఉత్కంఠత నెలకొంది. కర్నూలు మండలంలో చాలా మంది ఎంపీపీ పదవి కోసం ఆసక్తి చూపుతున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే, కేడీసీసీబీ చైర్మెన్‌ ఎంపీపీ పదవి ఎవరికి కేటాయించాలో స్పష్టత లేదు. ఇప్పటికే కొంతమంది ఎంపీపీటీసీ సభ్యులు తనకే మాటిచ్చారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కేవలం మరో 8నెలలే ఈ పదవీ కాలం ఉంది. .

చక్రం తిప్పిన విష్ణు, ఎమ్మెల్యే బొగ్గుల

కర్నూలు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానంలో కేడీసీసీబీ చైర్మెన్‌ విష్ణువర్థన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బొగ్గుల చక్రం తిప్పారు. 2021లో జరిగిన ఎంపీపీ ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లి పట్టు సాధించారు. అవిశ్వాస తీర్మాన విషయంలో కర్నూలు మండలంలో మొదటిస్థానంలో నిలిచింది. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మీడియాతో మాట్లాడారు. ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ క్రిడిట్‌ విష్ణువర్థన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:10 PM