Share News

శివారు కాలనీలే టార్గెట్‌

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:48 PM

జిల్లాలో దొంగలు పెట్రేగిపోతున్నారు. శివారు కాలనీలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. కేవలం సెక్షన్ల వ్యవధిలోనే జరిగే దొంగతనాలకు బాధితులు మూగ సాక్ష్యాలుగా మిగుల్తున్నారు.

శివారు కాలనీలే టార్గెట్‌

పెరిగిపోతున్న చోరీలు

నిద్రావస్థలో రాత్రి గస్తీ

స్టేషన్ల మధ్య లోపించిన సమన్వయం

పనిచేయని సీసీ కెమెరాలు

బెంబేలెత్తుతున్న ప్రజలు

కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

కర్నూలు క్రైం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దొంగలు పెట్రేగిపోతున్నారు. శివారు కాలనీలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. కేవలం సెక్షన్ల వ్యవధిలోనే జరిగే దొంగతనాలకు బాధితులు మూగ సాక్ష్యాలుగా మిగుల్తున్నారు. రాత్రిళ్లు మానేసి ఏకంగా పట్టపగలే గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. హైదరాబాద్‌లో ప్రతి రోజూ జరిగే దొంగతనాలు కర్నూలుకు పాకాయి. గొలుసు చోరీలను పోలీసులు నియంత్రించ లేకపోతున్నారు. చాకచక్యంగా వ్యవహరించలేక పోవడంతో సామాన్యులకు ఆవేదనే మిగులుతుంది. పట్టపగలు దొంగలు చెలరేగిపోతున్నా పోలీసులు సినిమా చూసినట్లు చూస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి తుపాకులతో బెదిరించినా.. మాకేమి అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తోంది.

ఏప్రిల్‌ 4వ తేదీన త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధనలక్ష్మినగర్‌లో నివాసం ఉం టున్న ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రూ.12లక్షల విలువైన సొత్తును అపహరిం చారు. (ఏడున్నర తులాల బంగారు, 5.5 లక్షల నగదు, కొంత వెండి నగదు అపహరించారు).

ఏప్రిల్‌ 12న త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పార్థసారధినగర్‌లో నివాసం ఉం టున్న రాంగోపాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లాడు. అతడి ఇంట్లో ఆరున్నర తులాల బంగారు నగలు, 50 తులాల వెండి నగలు చోరీచేశారు. 14వ తేదీ ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో ఉన్న నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు.

క్షణాల్లో తాళాలు పగలగొట్టి..

ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు క్షణాల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల నగరంలో ఓఇంట్లో మనుషులు లోపల ఉన్నా కూడా ఇం ట్లోకి చొరబడి నిద్రమత్తులో ఉండగానే చోరీ చేశారంటే వారు దొంగతనం ఎంత చాకచక్యంగా చేశారో అర్థం చేసుకోవచ్చు. ఒకేరోజు గంటల వ్యవధిలో స్నాచింగ్‌లకు, దొంగతనాలకు పాల్పడటం వారి శైలి. ఈముఠాలన్నీ బైక్‌ల నెంబర్‌ ప్లేట్లు మార్చి బయలు దేరుతారు.

రాత్రి విజన్‌ స్పష్టంగా..

నగరంలో సీసీ కెమెరాల పనితీరు కూడా అంతంత మాత్రమే. ఇవి కూడా నగరానికే పరిమితమయ్యాయి. గొలుసుదొంగతనాలు ఎక్కువగా శివారు కాలనీలో జరుగుతున్నాయి. ఈ సీసీ కెమెరాల్లో రాత్రి విజన్‌ స్పష్టంగా కనబడవు. పలు చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి. ఏదైనా నేరాలు జరిగితే తప్ప సీసీ కెమెరాలు గుర్తుకు రాని పరిస్థితి.

సమన్వయం లేక..

ఒక స్టేషన్‌ పరిధిలో దొంగతనం జరిగితే మరో స్టేషన్‌వారికి అప్ర మత్తం చేసే సమన్వయం ఇక్కడి పోలీసులకు లేదు. ప్రధాన రహదారులపై మాత్రమే తనిఖీలు ఉంటున్నాయి. క్యూఆర్‌టీ, రక్షక్‌ బైక్‌లు శివారు కాలనీ, వీధుల్లో తిరిగితే కొంత తగ్గే అవకాశం ఉంది. వాహ నాల తనిఖీ కూడా తూతూ మంత్రంగానే సాగుతుంది.

గస్తీ అంతంత మాత్రమే

నగర పరిధిలో ఐదు పోలీసుస్టేషన్లు ఉన్నా జనాభాకు సరిపడా పోలీసులు, తగినన్ని గస్తీ వాహనాలు లేవు. ఏదో నామమాత్రంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమేనన్న ఆరోపణలున్నాయి. కొత్త సిబ్బందికి తగిన అవగాహన లేకపోవడం. సీసీఎస్‌ ఆశించినస్థాయిలో పనిచేయకపోవడం. పాత నేరస్థులపై కదలికలు పసిగట్టకపోవడం. నగరంలో ఆటో నేరగాళ్లపై నిఘా కొరవడటం.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే..

దొంగతనాలను నియంత్రిం చేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. దొంగతనాలు జరిగాక పోలీసుల చుట్టూ తిరిగే కంటే మనసొమ్మును మనమే జాగ్రత్తగా కాపాడుకుంటే సొమ్ము పదిలం. మెయిన్‌ డోర్‌కు, ఇంటికి ఉన్న అన్ని బయటిడోర్లకు నాణ్యతా దృఢంగా ఉండే సెంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటుచేసుకోవాలి. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారం సిస్టమ్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి తాళం వేసి బయటకు గాని, వేరే ఊర్లకు గాని వెళ్లేటప్పుడు, విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బును ఇంట్లో ఉంచరాదు. ఒకవేళ ఇంట్లో దొంగతనం జరిగినపుడు ఏ వస్తువు కూడా తాకరాదు. బీరువాలను ముట్టరాదు. పోలీసులు వచ్చి వేలిముద్రలు తీసుకున్న తర్వాత ఏదైనా వస్తువులను తాకాలి. ఒకవేళ తాకిన వారు పోలీసులకు వారి వేలి ముద్రలు ఇవ్వాలి

Updated Date - Jun 03 , 2025 | 11:48 PM