తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టండి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:25 AM
జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్త కుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రులు ఫరూక్, బీసీ
కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం
నంద్యాల నూనెపల్లె, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్త కుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి తీవ్రత దృష్ట్యా జిల్లాలోని రూరల్, అర్బన్ ప్రాంతాల్లో సరఫరా చేయాల్సిన తాగునీటి అంశాలపై కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ రాజకుమారితో పాటు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి హాజరయ్యారు. మంత్రులు మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని నివారించేందుకు, నీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్, పబ్లిక్‌హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు పటిష్ట ప్రణాళికలు రూపొందించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.వేసవి కారణంగా భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న క్రమంలో వచ్చే వర్షాకాలం సీజన్ వరకు ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ 489గ్రామ పంచాయతీల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజాప్రతినిధును సమన్వయం చేసుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో దాదాపు 25 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఇంకిపోయాయని, నీటి వనరులను అన్వేషించి తాత్కాలిక నీటి సరఫరాపై దృష్టి సారించాలన్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ డోన్ ప్రాంతంలో అధిక శాతం వర్షాధారంపైనే ఆధారపడి ఉంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్యాపిలి మండలంలో బోర్లు వేశామని, వేసవి దృష్ట్యా మండలాల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సుగాలిమెట్ట మోడల్ స్కూల్‌లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తొగర్చేడులో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్‌ను పునరుద్ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, జడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్వో రామునాయక్, అధికారులు పాల్గొన్నారు.