గంజాయి తీసుకో... మద్యం బాటిల్ ఇచ్చుకో
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:57 PM
ఒక మద్యం బాటిల్ నాకివ్వు.... నీకు కావాల్సినంత గంజాయి ఇస్తా.... ఈ విష యం మనద్దరి మధ్యనే ఉండాలి... మూడో వ్యక్తికి తెలిసిందా... ఇకపై నీకు గంజాయి ఇవ్వను చూడు.... ఇదీ ఒప్పందం. కానీ ఏదో ఒక రోజు ఈ అక్రమ గంజాయి సరఫరా వ్యవహారం బయట పడు తుందని తెలుసుకోలేకపోయాడు.
చిన్న పెండేకల్లులో గంజాయి సాగు
కర్నూలు పోలీసుల అదుపులో నిందితుడు
ఆదోని రూరల్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఒక మద్యం బాటిల్ నాకివ్వు.... నీకు కావాల్సినంత గంజాయి ఇస్తా.... ఈ విష యం మనద్దరి మధ్యనే ఉండాలి... మూడో వ్యక్తికి తెలిసిందా... ఇకపై నీకు గంజాయి ఇవ్వను చూడు.... ఇదీ ఒప్పందం. కానీ ఏదో ఒక రోజు ఈ అక్రమ గంజాయి సరఫరా వ్యవహారం బయట పడు తుందని తెలుసుకోలేకపోయాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. ఆదోని మండలం చిన్నపెండేకల్లు గ్రామానికి చెందిన కురువ కోదండరాముడు తన మిరప పంటలో నిత్యం గంజాయి సాగు చేస్తూ, తనకు అనుకూలమైన వారికి విక్రయించేవాడు. కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో పని చేసే కార్మికుడికి గంజాయి సరఫరా చేసేవాడు. నీకు కావాల్సినంత గంజాయి ఇస్తా... గంజాయి నీకిచ్చినప్పుడల్లా నాకు ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలని దండరాముడు షరతు పెట్టాడు. ఈ మేరకు ఇరువురి మధ్య గంజాయి ఇవ్వడం, మద్యం తీసుకోవడం అనే వ్యవహారం సాగుతోంది.
కర్నూలులో తీగలాగిన పోలీసులు...
కర్నూలు త్రీటౌన్ పోలీసులకు అనుమానం వచ్చి ఆ హోటల్‌లో పనిచేస్తున్న కార్మికుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో గంజాయి మూలాలు బయట పడ్డాయి. ఆ హోటల్ కార్మికుడి ద్వారా పోలీసులు కోదండ రాముడుకు ఫోన్ చేయించి గంజాయి కావాలని అడి గించారు. సరే గంజాయి ఇస్తాను... నాకు మద్యం బాటిల్ తీసుకురా అని హోటల్ కార్మికుడికి కోదండరాముడు తెలిపాడు. నాలుగురోజుల క్రితం పోలీసులు రెండు వాహనాల్లో చిన్నపెండేకల్లుకు చేరుకొని హోటల్ కార్మికుడికి గంజాయి ఇస్తున్న కోదండరాముడిని అరెస్టు చేసి కర్నూలుకు తరలించారు. చిన్నపెండేకల్లు గ్రామం తాలుక పోలీస్ స్టేషన్‌పరిధికి వస్తుండడంతో నిందితుడిని త్రీటౌన్ పోలీసులు తాలుకా పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు.
గంజాయి నిర్వాహకుడిని అప్పజెప్పారు..
చిన్నపెండేకల్లుకు చెందిన కురువ కోదండరాముడ్ని కర్నూలు పోలీసులు మాకు అప్పజెప్పారు. మేం విచారిస్తున్నాం. నిందితుడు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మరికొందరిని విచారిస్తున్నాం. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తాం. - నల్లప్ప, తాలుక సీఐ, ఆదోని.