ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:03 AM
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా పిలుపునిచ్చారు.
ఆదివాసీ దినోత్సవంలో కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గానూ, పంచాయతీరాజ్ కమిషనర్‌గా కూడా తాను పని చేయడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ శాఖకు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తం డాలను పంచాయతీలుగా చేయాలనే విజ్ఞప్తులు మొదట అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చాయన్నారు. సంబంధిత అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒకే రోజు 160తండాలను పంచాయతీలుగా మార్చినట్లు తెలిపారు. గవర్నమెంటు ఆఫ్ ఇండియా నుంచి ఒకేరోజు 11 అవార్డులను తీసుకున్నామన్నారు. కర్నూలు జిల్లాలో రూ.180 కోట్లతో సీసీ రోడ్లు వేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. పదో తరగతిలో గిరిజన పాఠశాలల్లో 94 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ ఫ్లోరైడ్ సమస్యలు ఉన్న గిరిజన గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి సమస్యను తీరుస్తామన్నారు. కార్యక్రమంలో గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కొండయ్య, రాధిక, ఎరుకుల పోరాట సమితి స్టూడెంట్స్ అధ్యక్షుడు చంద్రప్ప, డీవీఎన్‌సీ సభ్యులు మాలతి, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.