డీసీఎంఎస్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:32 PM
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఇటీవలే సీఎం చంద్రబాబును కోరినట్లు ఉమ్మడి జిల్లా చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు.
సీఎంను కోరిన చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఇటీవలే సీఎం చంద్రబాబును కోరినట్లు ఉమ్మడి జిల్లా చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ ఒకప్పుడు సేవలందిం చడంలో సహకార సంస్థలకంటే ముందుండేదని, నేడు ఉనికిని కోల్పోయే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి సంస్థను గట్టెక్కించి ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. డీసీఎంఎస్‌కు మార్క్‌ఫెడ్ నుంచి దాదాపు రూ.2కోట్ల మేర బకాయిలు అందాల్సి ఉందన్నారు. వివిధ కారణాలతో నిధులు విడుదల కాలేదని, దీంతో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉనానయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉమ్మడి జిల్లాలో 17 కేంద్రాలు ఉన్నాయనీ, ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి పంట ఉత్పత్తులను సేకరించడంతో పాటు రైతులకు ఎరువులను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ విషయమై సీఎంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును కూడా కలిశామని, డీసీఎంఎస్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరిస్తామని వారు హామీ ఇచ్చారన్నారు. జిల్లా కేంద్రం కర్నూలులో ప్రధాన కార్యాలయాన్ని రూ.10కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రనాళికలు రూపొందించామని త్వరలో నిధులు మంజూరవుతాయని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్తులో ఉద్యోగులకు సకాలంలో జీతభత్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా మేనేజర్ రాజేష్, డీసీఎంఎస్ కేంద్రాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.