ఆ అధికారులపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:29 PM
: పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించని ఆదోని మున్సిపల్ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్, వక్ఫ్‌బోర్డు కర్నూలు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా డీఆర్వోను ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్ అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశం
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించని ఆదోని మున్సిపల్ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్, వక్ఫ్‌బోర్డు కర్నూలు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా డీఆర్వోను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. లాగిన్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలన్నారు. నగరంలోని వారు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ వద్ద 18 రోజుల నుంచి ఒక అర్జీ పెండింగ్‌లో ఉందని, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే కర్నూలు సబ్ రిజిస్ట్రార్ వద్ద 14 రోజుల నుంచి ఒక అర్జీ, గూడూరు మున్సిపల్ కమిషనర్ వద్ద 12 రోజుల నుంచి, క్రిష్ణగిరి తహసీల్దార్ వద్ద 3 అర్జీలు 7 రోజుల నుంచి, తుగ్గలి తహసీల్దార్ వద్ద 2 అర్జీలు 7 రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్వోను ఆదేశించారు. అర్జీలు చూడని అధికారులకు కేవలం మెమోలు మాత్రం ఇవ్వడం కాదని, మెమో ఇచ్చిన తర్వాత కూడా అలాగే పెండింగ్‌లో ఉంటే.. వారిని సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వోను ఆదేశించారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 11, కర్నూలు ఆర్డీవో వద్ద 7, పత్తికొండ ఆర్డీవో వద్ద 7, కలెక్టరేట్ ఏవో వద్ద 3, సర్వే ఏడీ వద్ద ఒక దరఖాస్తు చొప్పున పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.