Share News

ముంపు బాధితులను ఆదుకోండి

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:45 PM

శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

ముంపు బాధితులను ఆదుకోండి
కొత్తపల్లి తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న బొజ్జా దశరథరామిరెడ్డి

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి

కొత్తపల్లి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల వద్ద నీటి మట్టం ఉంటేనే రాయలసీమలోని బీడు భూములకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నందికొట్కూరు ప్రాంతంలో కేసీ ఆయకట్టు కింద ఉన్న సుమారు 50వేల ఎకరాలతో పాటు 66 గ్రామాలు సైతం ప్రాజెక్టు నిర్మానంలో ముంపునకు గురయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి త్యాగం చేసిన ముంపు ప్రాంతాల నిర్వాసితులను ప్రభుత్వం గుర్తించకపోవడంతో వారి జీవనం నేడు దుర్భరంగా మారిందన్నారు. 1986లో నాటి టీడీపీ ప్రభుత్వం 98 జీవో ద్వారా ముంపు ప్రాంతాల్లోని కుటుంబాల్లోని నిరుద్యోగులకు ఇంటికోక ఉద్యోగం నిర్ణయించినప్పటికీ కొద్ది మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రాజెక్టు కింద ముంపునకు గురైన గ్రామాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ ఉమారాణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు వైఎన్‌ రెడ్డి, సామాజిక రాయలసీమ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ నాగన్న, కొక్కెరంచ సర్పంచ్‌ విష్ణువర్దన్‌ రెడ్డి, సాయిరాం, అయ్యపురెడ్డి, శంకర్‌గౌడు, మహేష్‌, రహంతుల్లా, రాము,సాయి చరణ్‌, పెద్దరాముడు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:45 PM