ఆరుబయట చదువులు
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:11 AM
మండలంలోని కాత్రికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులూడింది
ఆలూరు మండలం కాత్రికి గ్రామ పాఠశాలలో పెచ్చులూడిన పైకప్పు
ఆలూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాత్రికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులూడింది. ఇప్పటికే భవనం శిథిలావస్థలో ఉండగా, భారీ వర్షాల ప్రభావానికి పైకపు పెచ్చులూడింది. రాత్రి సమయం కావడంతో విద్యార్థులు లేరు, దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల ఆదేశాలతో శుక్రవారం ఉదయం పిల్లలను పాఠశాల బయటే కూర్చోబెట్టి చదువులు కొనసాగించారు. ఈ విషయమై ఎంఈవో-2 చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో తరగతి గదులు మూయించి విద్యార్థులను బయట కూర్చోబెట్టాలని ఉపాధ్యాయుడికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పాఠశాలకు మరమ్మతులు చేయాలని ఉన్నతాధికారులకు నివేదించామన్నారు