Share News

గోడ కూలి విద్యార్థి దుర్మరణం

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:40 PM

వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కవాడీ వీధిలో ఓ ప్రైవేటు స్కూల్‌ ప్రాంగణంలో గోడ కూలి షేక్‌ రహీబ్‌బాషా (7) అనే విద్యార్థి దుర్మరణం చెందాడు.

గోడ కూలి విద్యార్థి దుర్మరణం
మృతదేహం వద్ద విలపిస్తున్న చిన్నారి తల్లి

కర్నూలు క్రైం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కవాడీ వీధిలో ఓ ప్రైవేటు స్కూల్‌ ప్రాంగణంలో గోడ కూలి షేక్‌ రహీబ్‌బాషా (7) అనే విద్యార్థి దుర్మరణం చెందాడు. స్థానిక కాలనీకి చెందిన రహీబ్‌ బాషా ఆ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వాజీదా, మొహిద్దీన్‌ బాషాలకు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం కూడా తల్లి వాజీదా బేగం తన కొడుకును తీసుకుని పాఠశాలకు వెళ్లింది. పాఠశాలలో ప్రార్థన జరుగుతుండటంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను యాజమాన్యం బయటే నిలబెట్టింది. పాఠశాల ఎదురుగానే ఓ షెడ్డును ఇటీవలే యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ షెడ్డుకు సంబంధించిన గోడ వర్షాలతో బాగా తడిసిపోయింది. చిన్నారి రహీబ్‌ బాషా, మరో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు అక్కడ నిల్చున్నారు. అయితే గోడ ఉన్నఫళంగా కుప్పకూలింది. ఇటుకలు చిన్నారి రహీబ్‌ బాషాపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. తల్లి వాజీదా భేగం అక్కడే ఉండటంతో వెంటనే కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే రహీబ్‌బాషా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 15 , 2025 | 11:40 PM