వేరుశనగ కొనుగోలు బహిష్కరణ
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:57 AM
వ్యవసాయ మార్కెట్ యార్డుకు విక్రయానికి వచ్చిన వేరుశనగ దిగుబడులను కొనుగోలు చేయకుండా సోమవారం వ్యాపారులు మొండికేశారు.
సాయంత్రం 6 వరకు టెండర్లు దాఖలు చేయకుండా వ్యాపారుల దోబూచులాట
గ్రేడింగ్ కొనసాగించాలంటూ వ్యాపారులు
రైతులకు నష్టం కలిగించే విధానంపై ఉపేక్షించబోమన్న కార్యదర్శి
మార్కెట్ కమిటీపైకి దూసుకొచ్చిన రైతులు
మార్కెట్ కమిటీకి రెండు రోజులు సెలవు
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ యార్డుకు విక్రయానికి వచ్చిన వేరుశనగ దిగుబడులను కొనుగోలు చేయకుండా సోమవారం వ్యాపారులు మొండికేశారు. పదివేల బస్తాలకు పైగా విక్రయానికి తీసుకొచ్చారు. రైతులు వేరుశనగ దిగుబడులను కమిషన్ ఏజెంట్ల దుకాణాల ముందు రాశులుగా టెండర్లకు ఉంచారు. 25వ తేదీ నుంచి వ్యాపారులు మహిళా కూలీలతో పాసింగ్ చేస్తే ఉపేక్షించమని మార్కెట్ యార్డు అధికారులు ముందుగానే హెచ్చరించారు. ఉదయం 11 గంటలకు రాశులుగా పోసిన వేరుశనగ పాసింగ్ లేకుండానే టెండర్లను కోట్ చేసుకుంటూ వెళ్లారు. వేరుశనగ వ్యాపారుల సంఘం నాయకులు కొంతమంది టెండర్ వేస్తున్న వ్యాపారులను వేయకుండా ఫోన్ ద్వారా హెచ్చరించారు. వ్యాపారులు టెండర్ వేస్తున్నారని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. టెండర్లో పాల్గొన్న వ్యాపారులంతా మార్కెట్ కమిటీ టెండర్ హాలులో ఆన్‌లైన్‌లో బీడ్ దాఖలు చేయకుండా టెండర్ ఫారాలను వారి జాబిలో పెట్టుకొని ఇంటికి వెళ్లిపోయారు. నాలుగు గంటల వరకు వారు కంప్యూటర్ రూమ్‌లకు రాకపోవ డంతో అధికారులు వెంటనే అప్రమత్తమై వేరుశనగ వ్యాపారులతో మాట్లాడారు. పాసింగ్ విధానం ఉంటేనే తాము టెండర్ దాఖలు చేస్తామని, లేకపోతే చేయలేమంటూ తెగేసి చెప్పారు. రైతులకు నష్టం కలిగించే ఈ విధానంపై ఉపేక్షించమని వ్యాపారులను మార్కెట్ యార్డ్ కార్యదర్శి హెచ్చరించారు. సాయంత్రం కావస్తుం డడంతో రైతులు ఒక్కసారిగా కమిషన్ ఏజెంట్లపై కొనుగోలు చేస్తారా లేదా అంటూ ఒత్తిడి పెంచారు. వారు మార్కెట్ కమిటీపై ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని వ్యాపారులతో చర్చిస్తున్నామని, మీ వేరుశనగ దిగుబడి వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ విషయం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ దృష్టికి మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన, సహాయ కార్యదర్శి శాంతకుమార్ తీసుకెళ్లారు. కార్యాలయానికి రావాలని ఆయన తెలపడంతో హుటాహుటిన కమిషన్ ఏజెంట్లు, అధికారులు పరుగులు పెట్టారు.
సబ్ కలెక్టర్ వెంటనే వన్‌టౌన్ సీఐ శ్రీరామును, తహసీల్దార్ రమేష్‌ను మార్కెట్ కమిటీకి వెళ్లి వ్యాపారులతో మాట్లాడి టెండర్లు జరిపే విధంగా చూడాలని సూచించారు. ఎంతసేపటికీ వారు ఒప్పుకో కపోవడంతో ఇలాగే కొనసాగితే లైసెన్స్ రద్దు చేస్తామని, రైతులకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే టెండర్లు వేయాలని కోరడంలో ఈ ఒక్క రోజే తాము టెండర్లు వేసి కొనుగోలు చేస్తామని అంగీక రించడంతో సమస్య సద్దుమణిగింది. సాయంత్రం ఏడు గంటల వరకు టెండర్లు వేయడంతో అధికారలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులపాటు మార్కెట్ కమిటీకి వేరుశనగ దిగుబళ్లను విక్రయానికి తీసుకురావద్దని మార్కెట్ కమిటీ కార్యదర్శి కల్పన తెలిపారు. రైతులకు నష్టం కలిగించే పాసింగ్ విధానాన్ని ఉపేక్షించమని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.