ఉపాధి అవినీతికి చెక్!
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:36 AM
‘ఉపాధి’లో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం సమూల మార్పులు తెస్తోంది
రెండు విడతలుగా ఫొటోలు అప్‌లోడ్ చేయాలి
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆలూరు, జూలై31(ఆంధ్రజ్యోతి): ‘ఉపాధి’లో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం సమూల మార్పులు తెస్తోంది. ఆగస్టు 1 నుంచి నిబంధనలను కఠినతరం చేస్తూ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్‌ఎంఎంఎస్) యాప్‌ను తెచ్చింది. పనికి రాకున్నా కలీలకు హాజరు వేసే దొంగ మస్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో 3,41,269 జాబ్‌కార్డులు ఉండగా 6,52,729 మంది కూలీలు పనిచేస్తున్నట్లు అధికారు లు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఉన్న నిబంధ నలను మరింత కఠినతరం చేయడంతో పాటు, అధికారుల పర్యవేక్షణ బాధ్యతలను పెంచింది.
రెండు పర్యాయాలు ఫొటోలు..
ఉపాధి మస్టర్లలో పేర్లు నమోదు చేసిన కూలీలు ఉదయం పనికిరాగానే ఒకసారి, అలాగే సాయంత్రం నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటోలు తీసి వాటిని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే శ్రామికులకు వేతన చెల్లింపులకు ఫోటోలు తప్పనిసరి చేసింది. ఫొటోలు ఏ రోజుకు ఆ రోజే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక రోజు పని ఫొటోలను తర్వాత రోజు అప్‌లోడ్ చేయడానికి వీలు పడదు.
పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ
పని ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఫోటోలను పంచాయతీ కార్యదర్శులు అప్‌లోడ్ చేయాలి. వీటిని పర్యవేక్షిస్తూ ఎంపీడీవోలకు నివేదిక అందజేయాలి. ఎన్ని ఫొటోలు సక్రమంగా తీశారనేది మండలస్థాయి అధికారులు తనిఖీ చేయాలి. గ్రామాల ఫోటోల నుంచి 20 శాతం వివరాలను జిల్లా అధికారులకు అప్‌లోడ్ చేయాలి.
అసత్వం వహిస్తే చర్యలు
క్షేత్రస్థాయిలో రెండోసారి ఫోటోలు తీయని ఫీల్డ్ అసిస్టెంట్, సీనియర్ మేట్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో అలస త్వం వహించే పంచాయతీ కార్యదర్శులు, మండల, జిల్లా అధికారులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మండలస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లకు యాప్‌పై అవగాహన కల్పిస్తున్నారు. కూలీలకు వేతనం రావాలంటే ఏ పూటకాపూట ఫొటోలు తీసుకోవాల్సిందే. లేదంటే ఆ రోజు వేతనం రాదు.
అవినీతి లేకుండా చేసేందుకే..
ఉపాధి పథకంలో పూర్తిస్థాయిలో అవినీతి లేకుండా చేసేం దుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఆగస్టు 1 నుంచి కూలీలను రెండు పూటలా ఫోటోలు తీస్తాం. క్షేత్రస్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఫోటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపై పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ ఉంటుంది. మండల, జిల్లా స్థాయి అధికారులకు కూడా ఫోటోలు పంపించాల్సి ఉంటుంది. దీనిపై అలసత్వం వహిస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లపై చర్యలు తప్పవు. - వెంకటరమణయ్య, పీడీ కర్నూలు