Share News

వలసలు నివారించాలి

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:41 AM

జిల్లాలో వలసలు నివారించేందుకు అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం- అనుబంధ శాఖలు, నీటి యాజమాన్య సంస్థ, మత్స్య శాఖ, దేవదాయ శాఖ తదితర అంశాలపై జిల్లా పరిషత్‌ సర్వసభ్యసమావేశం నిర్వహించారు.

వలసలు నివారించాలి
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాల్గొన్న అధికారులు

చెరువులను నింపడంలో అధికారుల నిర్లక్ష్యం

జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

రైతులను ఆదుకొని, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలి

జడ్పీటీసీల ఆవేదన

ముగిసిన సర్వసభ్య సమావేశం

కర్నూలు న్యూసిటీ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వలసలు నివారించేందుకు అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం- అనుబంధ శాఖలు, నీటి యాజమాన్య సంస్థ, మత్స్య శాఖ, దేవదాయ శాఖ తదితర అంశాలపై జిల్లా పరిషత్‌ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాల కలెకర్లు డా. ఏ. సిరి, జి. రాజకుమారి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలపై జడ్పీటీసీలు ప్రశ్నల వర్షం కురిపించగా వాటికి అధికారులు సమాధానాలు చెప్పారు. చైర్మన్‌ మాట్లాడుతూ ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించడానికి అధికారులు గ్రామ స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. అవుకు రిజర్వాయర్‌ ఎందుకు నింపలేదని అధకారులను జడ్పీటీసీలు ప్రశ్నించారు.

రైతుల ఖాతాల్లో రూ.10 కోట్లు జమ

మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్ల మొత్తాన్ని త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కర్నూలు కలెక్టర్‌ డా.ఏ .సిరి అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా మంగళ, బుధ వారాలలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని నిర్వహించి వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. .కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా పత్తిలో తేమ శాతం 13,14 శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉపాధి హామీ పనులతో జిల్లాలో వలసలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తుంగభద్ర హోస్పేట్‌ డ్యాంలో ఉన్న 30 గేట్‌లు మరమ్మతులు చేస్తున్నందున ఖరీఫ్‌, తాగునీటికి తప్ప, రబీకి నీరు ఇవ్వరని బోర్డు అధికారులు తెలిపిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ఐదు అంశాలకు ఆమోదం..

జిల్లాలో 138 పనులకు రూ.5.91 కోట్లు మంజూరు.

జిల్లా పరిషత్‌ పరిపాలన భవనంలో రూ.25 లక్షలతో లిఫ్టు ఏర్పాటు

సున్నిపెంటలో పని చేస్తున్న కార్మికులకు జడ్పీ నిధుల నుంచి జీతాల చెల్లింపు

స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంజూరు చేసిన రూ.3.52 కోట్ల పనుల రద్దు

59 సీపీసీడబ్ల్యూ స్కీం నిర్వహణకు టెండరుకు ఎవ్వరూ ముందుకు రావపోవడంతో పాతవారితోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు త్వరలో ఏర్పాటు..

మొక్కజొన్న కొను గోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. ఎన్‌హెచ్‌-340 జాతీయ రహదారి నిర్మాణం కారణంగా బ్రాహ్మణకొట్కూరు- దిగువపాడు ప్రాంత రైతులకు దాదాపు 2500 ఎకరాల పొలాలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు తగిన పరిష్కార చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మిడ్తూరు మండలం జలకనూరు, మద్దిలేరు వాగు మరమ్మతుల కోసం రూ.44 లక్షలు మంజూరు చేశామని, మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో 11,448 హెక్టార్ల పంట దిబ్బతినిందని, నష్టపరిహారం నిమిత్తం సంపూర్ణ నివేదకను ప్రభుత్వానికి పంపించామని అన్నారు.

బ్రాహ్మణకొట్కూరులో పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వైన్‌ షాప్‌ను తొలగించాలని గత ఎన్నో సమావేశాలలో అడిగిన అధికారులు స్పందించడం లేదని, తక్షణమే వైన్‌ షాప్‌ను తొలగించాలని నందికొట్కూరు జడ్పీటీసీ కరీమున్నిసా కోరారు.

శనగలు సబ్సిడీ కింద ప్రభుత్వ ధర కంటే బయటకే తక్కువగా కొనుగోలు చేస్తున్నారని, సబ్పిడీ కింద రైతులు ప్రభుత్వం నుంచి రూ. 5800 కొనుగోలు చేస్తుంటే బయట రూ.5600కే దొరుకుతున్నాయని ఓర్వకల్లు జడ్పీటీసీ రంగనాథగౌడు అన్నారు. నష్టపోయిన ఉల్లి రైతులకు హెక్టారుకు రై.50 వేలు చెల్లిస్తామని, ఇప్పటి దాకా ఇవ్వలేదని అన్నారు.

మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో మొక్కజొన్న మొత్తం వర్షానికి నాశనం అయిపోయిందని, నష్టపరిహారం చెల్లించాలని జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి కోరారు.

మిడ్తూరు మండల పరిధిలోని జలకనూరు చెరువుకు మరమ్మతు చేపట్టాలని జడ్పీటీసీ యుగంధర్‌రెడ్డి కోరారు.

ఉల్లి పంట వరదలో మునిగిపోయిందని, ఉల్లి రైతులను ఆదుకోవాలని సి.బెళగల్‌ ఎంపీపీ బొంతల మునెప్ప కోరారు.

చెరువులో తీస్తున్న మట్టిని అక్కడే వేయకుండా చెరువు గట్టుపై వేసేలా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు జడ్పీటీసీ కోరారు.

పత్తి కొనుగోలు చేయడం లేదని...కూటమి ప్రభుత్వ వచ్చాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్దుర్తి జడ్పీటీసీ సుంకన్న అన్నారు. ఈ సమావేశంలో సీఈఓ జి. నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బారెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయని, పరిహారం చెల్లించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. పంట వేసుకునేది కౌలు రైతులు కాబట్టి, నష్ట పరిహారం కౌలు రైతులకు ఇప్పించాలన్నారు. పత్తి కొనుగోలు చేయాలని, రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేయాలని అన్నారు. నంద్యాల చెక్‌పోస్టు వద్ద రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

కేజీ శనగలు కూడా దొరకడం లేదు

ఆదోని మండలంలో కేజీ శనగ కూడా దొరకడం లేదని కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.దేవేంద్రప్ప అన్నారు. పెద్ద హరివాణంలో 14 వేల ఎకరాల్లో శనగ పంట వేస్తారని, అధికారులు శనగ విత్తనాలు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పత్తి కొనుగోలు లేకపోవడంతో రైతుల తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద వంకలు, వాగుల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ఆదోని మండలంలో మార్కెట్‌ యార్డు నిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల సమన్వయంతో రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 12:41 AM