Share News

మీ సేవ కేంద్రాలకు మంగళం..!

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:02 AM

వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకు ఓ వెలుగు వెలిగి ప్రజలకు సుదీర్ఘ కాలం సేవలందించిన మీ సేవ కేంద్రాల మాట ఇక మర్చిపో వాల్సిందే. జగన్‌ హయాంలో సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో వీటికి చెక్‌ పడింది. ఫలితంగా మీసేవ కేంద్రాల నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరగా మారనుంది. సుమారు పది వేల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి.

మీ సేవ కేంద్రాలకు మంగళం..!
సీఎం, డిప్యూటి సీఎం, లోకేశ్‌కు అభినందనలు తెలుపుతున్న నిర్వాహకులు

జగన్‌ సచివాలయ వ్యవస్థతో కుదేలు

కూటమి వాట్సప్‌ గవర్నెన్స్‌తో ఆందోళన

అమలుకు నోచుకోని ఐటీ మంత్రి లోకేశ్‌ హామీ

రోడ్డున పడనున్న 10వేల కుటుంబాలు

నంద్యాల హాస్పిటల్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సేవలందించిన మీ సేవ కేంద్రాలకు మంగళం పలకడంతో వాటి నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరకపోవడంతో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థతో మీ సేవల నడ్డివిరిచారు. ప్రస్తుతం అధికారంలోకి రాగానే మీ సేవాకేంద్రాలను ఆదుకుంటామని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ ప్రకటించారు. అందుకనుగుణంగానే అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ అమలుకు నోచుకోకపోవడంపట్ల నిర్వాహ కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకు ఓ వెలుగు వెలిగిన మీ సేవా కేంద్రాలకు జగన్‌ చెక్‌ పెట్టాడు. మీ సేవ అందించే సర్వీసులన్నీ సచివాలయాల ద్వారా ఉచితంగా అందజేస్తామని చెప్పి తర్వాత రుసుం వసూలు ప్రారంభించారు. మీ సేవ కేంద్రాల ద్వారా తీసుకున్న సర్టిఫికెట్లు చెల్లవంటూ అప్పట్లో వలంటీర్లు, సచివాలయాల సిబ్బందితో ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు సచివాలయాలనే ఆశ్రయించారు. రాష్ట్రంలో 2019లో 11వేలకుపైగా మీసేవ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా రెవెన్యూ, ఏపీఎస్పీడీసీఎల్‌, హెల్త్‌, పోలీస్‌, రిజిస్ట్రేషన్‌, ఎండోమెంట్‌ తదితర శాఖలకు చెందిన దాదాపు 360 సర్వీసులు ప్రజలకు అందించేవారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుంలో కొంతభాగం కమీషన్‌ రూపంలో మీ సేవ నిర్వాహకులకు దక్కేది. దీంతో పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాదికుటుంబాలు జీవనం సాగించేవి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే మీ సేవలకు మహర్దశ వస్తుందని ఆశించిన నిర్వాహకులకు నిరాశనే మిగిలింది.

గతంలో మీ సేవ నిర్వాహకులకు సంఘీభావం తెలిపిన నారా లోకేశ్‌ రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు మీ సేవలకు సర్వీసులు పునరుద్ధరించకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు సులభతరమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇటీవల ముఖ్యమంత్రి వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించారు. దీంతో మీ సేవలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల మీసేవ నిర్వాహకుల కుటుంబాలు రోడ్డునపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మంత్రి లోకేశ్‌ ప్రకటించినప్పటికీ రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు మీ సేవల పునరుద్ధరణపై నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చొరవచూపి మీ సేవా కేంద్రాల భవితవ్యంపై సముచిత నిర్ణయం తీసుకుని మీ సేవ కేంద్రాలకు సర్వీసులు పునరుద్ధరించాలి.

మీ సేవ కేంద్రాలను ఆదుకోవాలి

మీ సేవ కేంద్రాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మంత్రి నారా లోకేశ్‌ హామీని అమలుపరచాలి. అద్దె, కరెంటు బిల్లు, స్టేషనరీ ఖర్చులు స్వయంగా భరిస్తూ కేంద్రాలు నడుపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే కొన్ని కేంద్రాలు మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నా. - కళ్యాణ్‌కుమార్‌ అధ్యక్షుడు, మీ సేవ కేంద్రాల అసోసియేషన్‌, నంద్యాల జిల్లా

Updated Date - Aug 17 , 2025 | 12:03 AM