Share News

రీ సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు: జేసీ

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:38 PM

రీ సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు: జేసీ

రీ సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు: జేసీ
జాయింట్‌ కలెక్టర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌

గోస్పాడు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రీ సర్వే ద్వారా ఉత్పన్నమైన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌ చెప్పారు. మండలంలోని జిల్లెల్ల గ్రామంలో బుధవారం భూ రీ సర్వే సమస్యలపై జేసీ గ్రామ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2023-24లో జరిగిన రీ సర్వేలో చాలా గ్రామాల్లో సమస్యలు తలెత్తాయన్నారు. అలాగే జిల్లెల్ల గ్రామంలో కొంతమంది రైతులకు జాయింట్‌ ఎల్‌పీలు పడ్డాయని, భూ కొలతల్లో తేడాలు, ఒకరి భూమి మరొకరికి కేటాయించడం వంటి సమస్యలు తలెత్తాయన్నారు. ఈ సమస్యలన్నింటినీ ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే పక్కాగా, పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇందులో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలన్నారు. భూ వివాదాలను పరిష్కరించడం సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, ఆ దిశగా సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా తప్పుల్లేకుండా పూర్తి చేయాలని సూచించారు. రీ సర్వే పనులు పక్కాగా చేయకపోతే రెండోసారి చేయాల్సివస్తుందని, రీ సర్వేకు సంబంధించిన ప్రతి పని జాగ్రత్తగా పరిశీలించి చేయాలని సూచించారు. జిల్లెల్ల గ్రామంలో రీ సర్వేలో ఎంతమంది రైతులకు భూ సమస్యలు వచ్చాయో నివేదిక తయారు చేసి ఇవ్వాలన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని, ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్‌, తహసీల్దార్‌ షేక్‌ మొహిద్దీన్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:38 PM