సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి: డీఆర్వో
ABN , Publish Date - May 16 , 2025 | 12:30 AM
జిల్లాలో నవోదయం 2.0 ద్వారా సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఆర్వో రామునాయక్ అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లె, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నవోదయం 2.0 ద్వారా సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఆర్వో రామునాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నవోదయం-2.0 కార్యక్రమ పటిష్ట అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో సభలు నిర్వహించి ప్రజాప్రతినిధుల ద్వారా సారా దుష్ప్రభావాలను వివరిస్తూ కళాజాతాలతో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1 9గ్రామాలు ఏ-కేటగిరి, 19 గ్రామాలు బి-కేటగిరి, 91 గ్రామాలు సి-కేటగిరిలుగా గుర్తించామని తెలిపారు. వీఏవో, వీఆర్వో, సచివాలయ సిబ్బందితో కమిటీలు ఏర్పాటు చేశామని సంబంధిత వ్యక్తుల సహకారంతో తనిఖీలు నిర్వహించి నాటుసారా నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. సారా మాన్పించేందుకు డీఆర్డీఏ, డ్వామా, మెప్మా సిబ్బందితో ఇంటింటి సర్వే ప్రక్రియ చేపట్టడంతోపాటు వారికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్, జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ, డీఈవో జనార్దన్‌రెడ్డి, డీఎఫ్‌వో నాగమునేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.