Share News

శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు సిద్ధం: ఈవో

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:48 PM

శ్రీశైల క్షేత్రంలో ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరగబోయే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీశైలంలో దసరా మహోత్సవాలకు సిద్ధం: ఈవో
ఈవో శ్రీనివాసరావు

శ్రీశైలం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరగబోయే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆలయ పరిపాలనా భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22న ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అక్టోబరు 1వ తేదీ మహర్నవమి రోజున రాష్ట్ర ప్రభుత్వం వారిచే స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాణరెడ్డి హాజరవుతారని తెలిపారు. అక్టోబరు 2న విజయదశమి సందర్భంగా సాయంకాలం నిర్వహించే తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆర్‌.రమణమ్మ, ఏఈవో హరిదాసు, ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 11:48 PM