శ్రీశైలం.. భక్త జనసంద్రం
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:01 AM
శ్రీశైల క్షేత్రమంతా శివపారవశ్యంతో నిండిన భక్తుల కోలాహలంగా మారింది. వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి యాత్రికులు పోటెత్తారు.
శ్రీశైలం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రమంతా శివపారవశ్యంతో నిండిన భక్తుల కోలాహలంగా మారింది. వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి యాత్రికులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసుకుని స్వామి, అమ్మవారి దర్శనార్థం క్యూలైన్లలో బారులుదీరారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం కాగా, శీఘ్ర దర్శనానికి 4 గంటలు, అతిశీఘ్ర దర్శనానికి 3 గంటలు, వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఒక్కసారిగా వేలాదిమంది భక్తులు రావడం.. సిఫార్సులతో ముందస్తు సమాచారం లేకుండా వచ్చిన వారికి దర్శనాలు కల్పించడంలో అధికారులు సిబ్బంది పనితీరు అభినందనీయమని ఈఓ శ్రీనివాసరావు అన్నారు. గురువారం గర్భాలయ అభిషేకాలతోపాటు సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు ఉండటంతో నిర్ణీత టైంస్లాట్ ప్రకారం భక్తులకు దర్శనాలు కల్పించడంలో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏర్పాట్లను ఈఓ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
సిఫార్సులతో సమస్యలు
శ్రీశైలానికి క్షేత్రానికి వచ్చే కొందరు భక్తులు ముందస్తు సమాచారం లేకుండా సిఫార్సు లేఖలు తీసుకురావడం, ఫోన్లు చేస్తున్న ద్వితీయ శ్రేణి వీఐపీలతో అధికారులు విసిగిపోతున్నారు. క్షేత్రానికి వచ్చీరాగానే వసతి గదులకోసం అభ్యర్థన ఆ తరువాత స్పర్శ దర్శనం కావాలంటూ ఆలయ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా వచ్చే యాత్రికులకు మాత్రమే దర్శనాలు వసతి ఏర్పాట్లను కల్పించేందుకు వీలవుతుందని అధికారులు అంటున్నారు.