శ్రీశైలం.. భక్తజన సంద్రం
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:31 PM
కార్తీకమాసం ఆఖరి రోజుల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం నలుమూలల నుంచి వస్తున్న యాత్రికులతో శ్రీశైల క్షేత్రం కిక్కిరిసిపోయింది.
కార్తీక మాసం ఆఖరి రోజుల్లో ఆదిదంపతుల దర్శనం
వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైలం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం ఆఖరి రోజుల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం నలుమూలల నుంచి వస్తున్న యాత్రికులతో శ్రీశైల క్షేత్రం కిక్కిరిసిపోయింది. వేలాదిగా వస్తున్న భక్తులు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనాలు చేసుకుని మెక్కులు తీర్చుకుంటున్నారు. కృష్ణమ్మలో పుణ్యస్నానాలు, దీపదానాలతో నదీతీరాన శివనామస్మరణ మార్మోగిపోయింది. స్వామి, అమ్మవార్ల సర్వ దర్శనాలకు సుమారు నాలుగు గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. వారాంతపు సెలవులతో పాటు నేడు చివరి సోమవారం సందర్భంగా క్షేత్ర పరిసరాలన్ని కిక్కిరిసిపోయాయి. క్యూలైన్‌లో వేచి ఉండే భక్తులకు అల్పాహారంతో పాటు పాలు, తాగునీరు అందిస్తున్నారు. సాయంకాలం కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభం వద్ద ఈవో శ్రీనివాసరావు ఆకాశదీపానికి ప్రత్యేక పూజలు చేసి భక్తుల దర్శనాలకు అనుమతించారు. అదేవిధంగా అమ్మవారి ప్రాకారోత్సవంలో స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పల్లకీ సేవ నిర్వహించారు. వివిధ పుష్పాలతో అలంకరించిన పల్లకిలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేసి అమ్మవారి ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయ దక్షిణ మాఢవీదిలో కళారాధన వేదికపై కూచిపూడి నృత్యాలు అందరినీ అలరించాయి.