శ్రీగిరి క్షేత్రం.. కార్తీక శోభితం
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:06 PM
మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్పవాలు వైభవంగా జరుగుతున్నాయి.
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీశైలం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్పవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని కార్తీక దీపాలు వెలిగించేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో శనివారం క్షేత్ర ప్రాంతాలన్నీ రద్దీగా కనిపించాయి. వారాంతపు సెలవు రోజులతోపాటు కార్తీకమాసం చివరి వారం కావడం వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. యాత్రికులతో శ్రీగిరిలోని వసతి సముదాయాలు కిటకిటలాడాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దర్శనాలు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకున్నట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. స్వామిఅమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో అందరికీ అలంకార దర్శనం మాత్రమే ఉన్నందున దర్శనానికి రెండు గంటల సమయం మాత్రమే పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి అన్నప్రసాదాన్ని ఆందుబాటులో ఉంచుతూ క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. గంగాధర మండపం వద్ద, శివాజీ గోపురం మాడవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉసిరి చెట్ల కింద భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.