చెత్త సేకరణకు ప్రత్యేక ప్రణాళికలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:36 PM
నగర పాలక సంస్థ పరిధిలో చెత్త సేకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పేర్కొన్నారు.
వ్యర్థాలతో కరెంటు ఉత్పత్తికి చర్యలు
ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
కర్నూలు న్యూసిటీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ పరిధిలో చెత్త సేకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పేర్కొన్నారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో చెత్త సేకరణ, వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగర పరిధిలోని గార్గేయపురం, జోహరాపురం డంపింగ్ యార్డులను పరిశీలించారు. అక్కడ తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నగరంలో చెత్త డంపింగ్ లేకుండా ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడుతున్నారు. ప్రతి రోజు నగరం నుంచి 200 నుంచి 225 టన్నుల చెత్త బయటికి వస్తుందన్నారు. నగరంలో ఇంటింటికి చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా 91 ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసేందుకు టెండరు పిలిచినట్లు తెలిపారు. నగరపాలక సంస్థకు సంబంధించి వాహనాల కోసం ప్రత్యేకంగా ఒక డిపోను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. చెత్తలో మిగిలిన వ్యర్థాలతో కరెంటు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు. నగరాన్ని త్వరలోనే చెత్తరహిత నగరంగా ప్రకటించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో కమిషనర్ పి.విశ్వనాథ్, అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.