Share News

ప్రాజెక్టులు, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:53 PM

ప్రాజెక్టులు, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి

ప్రాజెక్టులు, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి

వలసల నివారణకు కృషి

ప్రభుత్వ సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలి

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేలా చర్యలు

ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌ అభివృద్ధి దిశగా అడుగులు

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి

అమ్మ ప్రోత్సాహమే కలెక్టర్‌ను చేసింది

కలెక్టర్‌ అట్టాడ సిరి

‘ఐఏఎస్‌ పదోన్నతి వచ్చాక తొలిసారిగా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా బావిస్తున్నా. గతంలో అనంతపురం జిల్లా జేసీగా పని చేయడంతో రాయలసీమ ప్రాంత పరిస్థితులపై అవగాహన ఉంది. జిల్లాను పట్టిపీడిస్తున్న వలసల నివారణ కోసం చర్యలు తీసుకుంటా. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్‌ సిక్స్‌ పథకాల’ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా బాధ్యతగా కృషిచేస్తానని’ ఆదిశగా వేగంగా అడుగులు వేస్తా అని కలెక్టర్‌ అట్టాడ సిరి పేర్కొన్నారు.

కర్నూలు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కలెక్టర్‌ సిరి పేర్కొన్నారు. శనివారం ఆమె జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వేదావతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు సహా అసంపూర్తిగా ఉన్న హంద్రీనీవా పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువలు పూర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌, కర్నూలు స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై ప్రత్యేకదృష్టి సారించి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

ఆంధ్రజ్యోతి: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తమరికి ప్రత్యేక అభినందనలు. కలెక్టర్‌గా జిల్లా అభివృద్ధిలో ముద్ర ఉండబోతుందా..?

కలెక్టర్‌: థ్యాంక్స్‌ అండి..! నాకు ఐఏఎస్‌గా పదోన్నతి వచ్చాక తొలిసారిగా కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టా. ప్రభుత్వ ప్రాధ్యాత పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తాను. కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తుంది. ఆఫలాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా చూస్తాను. జిల్లా ప్రగతి కోసం చేయాల్సిన పనులపై ప్రణాళిక తయారు చేసి ఆ దిశగా ముందకు వెళ్తాను.

ఆంధ్రజ్యోతి: జిల్లా అభివృద్ధి కోసం కలెక్టర్‌గా ఎలాంటి ప్రాధాన్యతలు గుర్తించారు?

కలెక్టర్‌: ఈ రోజే బాధ్యతలు తీసుకున్నా. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించా. పశ్చిమ ప్రాంత పల్లెల్లో కరువు, వలసల తీవ్రత అధికంగా ఉందని గుర్తించాను. తాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు, కర్నూలు స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేయాలి. ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం ద్వారా వలసలు నివారించొచ్చు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసువెళ్లి ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా.

ఆంధ్రజ్యోతి: జిల్లాలో వేదావతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు సహా హంద్రీనీవా ప్రాజెక్టు పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ఎలాంటి దృష్టి సారిస్తారు?

కలెక్టర్‌: ఈప్రాజెక్టులు పూర్తిచేస్తే కరువు, వలసలు నివారించొచ్చు. భూగర్భజలాలు కూడా పెరుగుతాయి. తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టవచ్చు. మొదట ఇరిగేషన్‌ ఇంజనీర్లతో ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించి ఏఏ ప్రాజెక్టు ఏదశలో ఉంది? ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయా? వెళ్లిఉంటే ఏదశలో ఉన్నాయి? వంటి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. సమగ్రవివరాలు సీఎం చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లి పూర్తిచేయడానికి కృషిచేస్తా.

ఆంధ్రజ్యోతి: ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

కలెక్టర్‌: ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌ జిల్లా ముఖ చిత్రాన్నే మార్చేసే భారీ ప్రాజెక్టు ఇది. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే జైరాజ్‌ ఇస్పాత్‌ ఐరన్‌ పరిశ్రమ, గ్రీన్‌కో సంస్థ నిర్మించిన పిన్నాపురం పునరు త్పాదక ఇంధన ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పలు భారీ పరిశ్రమలు ఏర్పాటు కోసం ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తే మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఆద్వారా నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. నోడ్‌ అభివృద్ధిపై ప్రత్యేకదృష్టిని కేంద్రీకరి స్తాను. పరిశ్రమలు.. ప్రాజెక్టులు పూర్తిచేస్తే జిల్లా సమగ్రాభివృద్ధి సాధిస్తుంది. ఆ దిశగా నా కృషి ఉంటుంది.

ఉద్యోగ ప్రస్థానం

శ్రీకాకుళంలోని పార్వతిపురం ఆర్డీవోగా తొలి పోస్టింగ్‌. తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో జేసీ-2గా పనిచేశాు. 2015లో ఐఏఎస్‌ పదోన్నతి వచ్చాక అనంపురం జిల్లా విలేజ్‌, వార్డు సచివాలయం జేసీగా విధులు నిర్వహించా. రాయలసీమ ప్రాంత పరిస్థితులపై కొంత అవగాహన ఉంది. స్ర్తీశిశు సంక్షేమం, అభివృద్ధి శాఖ డైరెక్టరు, సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్డ్‌ టెక్నాలజీ స్పెషల్‌ కమిషనర్‌, ఏపీఎస్‌ఏసీఎస్‌ ఎండీ, సెకండరీ హెల్త్‌ శాఖ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించా. తొలిసారిగా కర్నూలు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాను.

అమ్మ ప్రోత్సాహంతోనే..

మాది శ్రీకాకుళం జిల్లా. అమ్మ ఎ.లలిత, నాన్న ఎ.లక్ష్మణరావు పుట్టిపెరిగిన ప్రాంతం అది. నాన్న గ్రూప్‌-2లో విజేతగా నిలిచి వాణిజ్య పన్నుల విభాగంలో ఏసీటీవోగా బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగరీత్యా నాన్న విశాఖపట్నంలో స్థిరడ్డారు. అదే శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పదవీ విరమణ పొందారు. నేను పుట్టి పెరిగింది విశాఖలోనే. ఎల్‌కేజీ నుంచి మెడిసిన్‌ వరకు నా విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. ఆంధ్ర మెడికల్‌కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫైనలి యర్‌లో ఉండగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వచ్చింది. నాకైతే డాక్టర్‌ అవ్వాలని బలమైన కోరిక ఉండేది. నాన్నకు కూడా వైద్యురాలిగానే సేవలు అందించాలని అనేవారు. అమ్మ మాత్రం నన్ను గ్రూప్‌-1 పరీక్షలు రాయమని ప్రోత్సహించింది. అప్పటికే నాకు డాక్టర్‌ సురేశ్‌తో వివాహం కావడంతో నా భర్త కూడా అమ్మమాట కాదనకు అంటూ ప్రోత్సహించారు. అలా గ్రూప్‌-1కు దరఖాస్తు చేయడం, తొలి ప్రయత్నంలోనే ఉత్తమ ఫలితం సాధించా. హౌస్‌ సర్జన్‌ చేస్తుండగా గ్రూప్‌-1 ఇంటర్వ్యూకు హాజరై ఎంపికయ్యా. ఈరోజు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టానంటే అమ్మ ప్రోత్సాహమే. మాకు ఇద్దరు పిల్లలు సంతానం.

డాక్టర్‌ అట్టాడ సిరి, కలెక్టర్‌

Updated Date - Sep 13 , 2025 | 11:53 PM