Share News

కర్నూలు నుంచి వైజాగ్‌కు ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:33 PM

కర్నూలు నుంచి వైజాగ్‌కు ప్రత్యేక బస్సులు

కర్నూలు నుంచి వైజాగ్‌కు ప్రత్యేక బస్సులు
బస్సును ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత్‌

ప్రారంభించిన మంత్రి టీజీ భరత్‌

కర్నూలు రూరల్‌ నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ ఆర్టీసీ కర్నూలు నుంచి వైజాగ్‌కు మూడు ఏసీ బస్సులను ఏర్పాటు చేయగా శనివారం నగరంలోని ఆర్టీసీ కొత్తబస్టాండ్‌లో పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి వైజాగ్‌కు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఏసీ సర్వీసులు అందుబాటులోకి తీసుకవచ్చామని వివరించారు. దీనివల్ల రెండు ప్రాంతాలకు అనుసంధానం పెరుగడమే కాకుండా టూరిజం పరంగా మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. వైజాగ్‌కు బస్సు సర్వీసు కావాలని తెలిసిన వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రయాణికుల కోరిక మేరకు మూడు నూతన బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆటోమేటిక్‌ స్ర్పింక్లర్‌ సిస్టమ్‌ బస్సులో ఉంటే ప్రాణపాయం జరగకుండా ఉంటుందన్నారు. ఈవిషయంపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు చెప్పారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ఆటోమెటిక్‌ స్ర్పింక్లర్‌ సిస్టమ్‌పై చర్చిస్తామని మంత్రి చెప్పారు. కర్నూలు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, డిపో మేనేజర్లు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 11:33 PM