పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:24 AM
గ్రామాల్లో పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికా రులకు సూచించారు.
గూడూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికా రులకు సూచించారు. మండలంలోని కె.నాగలాపురం గ్రామంలో శనివారం ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’లో భాగంగా ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం సుంకులాపరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు మాసంలో ‘వర్షాకాల పరిశుభ్రత’ థీమ్‌తో కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో డ్రైనేజీలు, కుంటలు, గుంతలు, టైర్లల్లో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. దోమలను నివారించాలంటే కచ్చితంగా ఎప్పటికప్పుడు నీటిని తొలగించి స్ర్పే, ఫాగింగ్ చేయడం, ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో ప్రతి రోజు ఇళ్ల వద్ద నుంచి చెత్తను సేకరించాలని, కాలువలను శుభ్రం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రత పాటించాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు లేకపోతే ప్రతిపాదనలు పంపించాలని, వీధి దీపాలు ఎక్కడైనా లేకుంటే వేయించాలని ఆదేశించారు. అనంతరం క్లాప్ మిత్రలను కలెక్టర్ సన్మానించారు.
హౌసింగ్ లే అవుట్ పరిశీలన
కె.నాగలాపురం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ రంజిత్ బాషా హౌసింగ్ లేఅవుట్‌ను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశిలించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి, హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, సర్పంచ్ జె.నయోమి, తహసీల్దార్ వెంకటేశ్ నాయక్, టీడీపీ మండల కన్వీనర్ జె.సురేష్, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.