కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు
ABN , Publish Date - May 24 , 2025 | 11:42 PM
ఖరీఫ్ సాగు చేయడానికి ముఖ్యమైన నైరుతి రుతుపవనాలు 12 రోజుల ముందుగానే శనివారం కేరళలో ప్రవేశించాయి.
16 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ముందస్తు వానలు
పొలం పనుల్లో రైతులు బిజీ బిజీ
కర్నూలు అగ్రికల్చర్, మే 24 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సాగు చేయడానికి ముఖ్యమైన నైరుతి రుతుపవనాలు 12 రోజుల ముందుగానే శనివారం కేరళలో ప్రవేశించాయి. రెండు రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నైరుతి రుతుపవనాలు వస్తాయని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు అంచనాలకంటే ముందుగానే ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. 2001, 2009లో రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. ఆ రెండేళ్లలో మే 23నే కేరళను తాకాయి. రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా మే నెలాఖరులో రుతుపవనాలు ప్రవేశించి ముందస్తు వర్షాలు కురవడం వల్ల పంటలు క్రిమికీటకాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులు వచ్చాయని రైతులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం ఖరీఫ్‌లో పత్తి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చిందని, అదే పరిస్థితి ఈ సంవత్సరం కూడా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కర్నూలు జిల్లాలో సాధారణ వర్షపాతం 614.7 ఎంఎం కాగా, 605 ఎంఎం నమోదైంది. నంద్యాల జిల్లాలో 559.4 ఎంఎం వర్షపాతానికిగాను 726.4 ఎంఎం నమోదైంది. 30 శాతం అధికంగా ఆ జిల్లాలో నమోదైంది. ఈ ఏడాది రెండు జిల్లాలో కలిపి ఖరీఫ్‌లో 6.40 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానంగా రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి ఈసారి 2.50 లక్షల హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు.