అమ్మను వదిలేసిన కొడుకులు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:50 PM
కని, పెంచిన పిల్లలే తల్లి వృద్ధుదాలైందని రోడ్డున వదిలేశారు. మూడు రోజులుగా దిక్కులేకుండా ఆకలితో అలమటిస్తున్న ఆ వృద్దురాలు చూసి పట్టణంలోని జీవనజ్యోతి ఆశ్రమానికి సమాచారం ఇచ్చారు.
రోడ్డు పాలైన వృద్ధ తల్లి
అక్కున చేర్చుకున్న వృద్ధాశ్రమ నిర్వాహకులు
ఆదోని అగ్రికల్చర్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : కని, పెంచిన పిల్లలే తల్లి వృద్ధుదాలైందని రోడ్డున వదిలేశారు. మూడు రోజులుగా దిక్కులేకుండా ఆకలితో అలమటిస్తున్న ఆ వృద్దురాలు చూసి పట్టణంలోని జీవనజ్యోతి ఆశ్రమానికి సమాచారం ఇచ్చారు. ఆశ్రమ నిర్వాహకుడు పాస్టర్ విక్టర్ పాల్ ఫిలిప్ (72) ఏళ్ల వృద్దురాలని అక్కున చేర్చుకున్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన బేగారి లక్ష్మమ్మ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉందని ఆమె తెలిపింది అన్నారు. ఆమెకు ఆరోగ్యం బాలేకపోతే రాయచూర్ నుంచి ఆదోనికి ఆసుపత్రిలో చూపిస్తామని కుమారులు తీసుకొచ్చారన్నారు. కుమారులు రంగా, రమేష్ బసప్ప మాటలు విని వృద్ధురాలు నరసమ్మ ఆదోనికి చేరుకుంది. ఎమ్మిగనూరు సర్కిల్ సమీపంలోని మెడికల్ షాప్ వద్ద ఆమెను కుమారులు వదిలేసి వెళ్లారు. మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న వృద్ధురాలిని మెడికల్ షాప్‌లో పనిచేసే వలి తమకు సమాచారం ఇచ్చారన్నారు. హిందీ ఉపాఽధ్యాయుడు నరసయ్య మానవత్వంతో భోజనం అందించారు. ఆశ్రమ నిర్వాహకుడు ఫిలిప్ అక్కున చేర్చుకుని ఆశ్రమానికి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యునితో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.