పేగుబంధాన్ని మరిచారు
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:22 AM
నేటి సభ్య సమాజంలో బంధాలు భారమవుతున్నాయి.. మానవత్వం మంట గలిసిపోతోంది.. నవమాసాలు మోసిన పేగుబంధాన్ని మరిచిపోతున్నారు.
..మాతృమూర్తిని వదిలేశారు..!
ఆదోని, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నేటి సభ్య సమాజంలో బంధాలు భారమవుతున్నాయి.. మానవత్వం మంట గలిసిపోతోంది.. నవమాసాలు మోసిన పేగుబంధాన్ని మరిచిపోతున్నారు. వృద్ధాప్యంలో అమ్మను అక్కున చేర్చుకోవాల్సిన కొడుకులే కర్కషులుగా మారుతున్నారు. బిడ్డకు చిన్నపాటి కష్టమొచ్చినా నేను అంటూ ముందుండే త్యాగమూర్తి అమ్మ.. సృష్టిలోనే
అమూల్యమైన బంధం అమ్మ.. అమ్మఒడిలో ఆడిన ఆటలు వీరికి గుర్తుకు లేవా.. ఆమె చేయి పట్టుకొని వేసిన అడుగులు విస్మరించారా.. అసలేమైంది ఈ పుత్రరత్నాలకు.. ఎందుకు అమ్మను ఇంత క్షోభకు గురి చేస్తున్నారు.. వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లినే రోడ్డున వదిలేశారు కొడుకులు.. ఈఘటన ఆదోని పట్టణంలో చోటుచేసుకుంది. లక్ష్మమ్మది కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలుకా బూదిగుంప స్వగ్రామం. హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన సవారప్పతో లక్ష్మమ్మకు వివాహమైంది. ఈమెకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త సవారప్ప బతుకుదెరువు కోసం బూదిగుంప గ్రామానికి వలసవెళ్లాడు. అక్కడే స్థిరపడి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు. సవారప్ప కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. లక్ష్మమ్మ ఒంటరైంది. కొడుకులు తల్లిని భారంగా భావించారు. ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి కొడుకు రమేష్ ఆమెను బస్సులో ఆదోనికి తీసుకొచ్చాడు. పట్టణంలోని ఎమ్మిగనూరు సర్కిల్‌లో ఉన్న కృష్ణుడు దేవాలయం సమీపంలో ఆమెను దింపి, మళ్లీ వస్తానని వదిలి వెళ్లిపోయాడు. రెండు రోజులపాటు అన్నం, నీళ్లు లేక ఆ 90 సంవత్సరాల వృద్ధురాలు రోడ్డుపై ఉండి ఇబ్బందులు పడింది. గమనించిన చుట్టుపక్కల ఇళ్లవారు మానవత్వంతో స్పందించారు. ఆమెకు భోజనం పెట్టారు. అనాథాశ్రమానికి సమాచారం అందించారు. ఆశ్రమ నిర్వాహకులు వెంటనే వచ్చి ఆమెను తీసుకెళ్లి అలనా, పాలనా చూస్తున్నారు. ఆవృద్ధురాలికి హొళగుంద మండలం హెబ్బటంలో ఐదెకరాల పొలం ఉన్నట్లు తెలిసింది. ఈ ఆస్తి కోర్టు వివాదంలో ఉంది. ఆస్తి కోసమే కొడుకులు కన్నతల్లిని దూరం చేసుకున్నారా? అన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. మాతృమూర్తిని వీధిన పడేసిన వారిపై చర్యపై తీసుకోవాలని మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి, ప్రజలు, మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.