ఆస్తి కోసం తల్లిని కడతేర్చిన కొడుకు
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:55 AM
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటి పాపలా చూసుకోవాల్సిన కొడుకు ఆస్తి కోసం మద్యం మత్తులో కడతేర్చాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవా డలో జరిగింది. సోమవారం తెల్లవారు జామున వృద్ధురాలు అంబటి చిన్న పుల్లమ్మ(75)ను ఆమె కొడుకు బాలగుర్రప్ప రోకలి బండతో కొట్టి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.

రోకలి బండతో చంపిన వైనం
ఉయ్యాలవాడ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటి పాపలా చూసుకోవాల్సిన కొడుకు ఆస్తి కోసం మద్యం మత్తులో కడతేర్చాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవా డలో జరిగింది. సోమవారం తెల్లవారు జామున వృద్ధురాలు అంబటి చిన్న పుల్లమ్మ(75)ను ఆమె కొడుకు బాలగుర్రప్ప రోకలి బండతో కొట్టి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పుల్లమ్మకు కుమారుడు, కుమార్తె మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె చుట్టు పక్కల గ్రామాల్లో సున్నం అమ్ముకుంటూ జీవిస్తోంది. కుమారుడు బాల గుర్రప్ప మద్యానికి బానిసై డబ్బు కోసం తల్లిని, భార్యను వేధించేవాడు. దీంతో అతని భార్య 10 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయింది. అప్పటి నుంచి బాలగుర్రప్ప మద్యం తాగుతూ బయట తిరిగేవాడు. అప్పుడ ప్పుడూ తల్లి దగ్గరకు వచ్చి డబ్బు కోసం వేధిస్తూ ఉండేవాడు. ఇటీవల వృద్ధురాలు తన ఇంటిని మనవడు శివశంకర్ పేరు మీద రాయించింది. దాన్ని జీర్ణించుకోలేక ఆస్తిని తన పేరుమీద రాయించాలని గొడవపడేవాడు. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వృద్ధురాలు వంట చేస్తుండగా డబ్బులు ఇవ్వాలని అడిగితే తల్లి ఇవ్వలేదు. దాంతో గుర్రప్ప పక్కనే ఉన్న రోకలిబండ తీసుకొని తలపై బలంగా కొట్టటంతో వృద్ధురాలు అక్కడికక్కడే నేల వాలింది.
ఇంటి చుట్టు పక్కలవారు, బంధువులు గమనించి ఆమెను అళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. వృద్ధురాలి అల్లుడు షేగు రమణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. ఆళ్లగడ్డ సీఐ మురళీధర్‌రెడ్డి విచారణ చేపట్టారు. నంద్యాల నుంచి క్లూజ్‌టీమ్స్‌ను రప్పించి రక్తపు మరకలు, వేలిముద్రలను సేకరించారు. స్థానికులు నిందితుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.