రైతుల కష్టాలు తీర్చండి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:36 PM
రైతులు కష్టాలు తీరేలా ఉదారంగా రుణాలు అధిక మొత్తంలో ఇవ్వాలని కలెక్టర్ రంజిత్ బాషా బ్యాంకు అధికారులను ఆదేశించారు.
పంట సాగుకు అధిక మొత్తం రుణాలు ఇవ్వాలి
వ్యవసాయ రుణాలు రూ.6,162.06 కోట్లు అందించాలని బ్యాంకులకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు అగ్రికల్చర్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రైతులు కష్టాలు తీరేలా ఉదారంగా రుణాలు అధిక మొత్తంలో ఇవ్వాలని కలెక్టర్ రంజిత్ బాషా బ్యాంకు అధికారులను ఆదేశించారు. గురు వారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో అన్ని బ్యాంకుల అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు వివిధ రంగాలకు ఈ సంవత్సరం అందించాల్సిన రుణ ప్రణాళికను వివరించారు. అన్ని రంగాలకు కలిపి రూ.17,412.86 కోట్లు లక్ష్యంగా నిర్ణయించామని, గత సంవత్సరంతో పోలిస్తే 15.49 శాతం ఎక్కువ అని కలెక్టర్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి ఖరీఫ్ రుణాలు రూ.3,635.62 కోట్లు, రబీ వ్యవసాయ రుణాలు రూ.2,526.44 కోట్లు అందించాలని అన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో మొత్తం వ్యవసాయ రుణాలు రూ.6,162.06 కోట్లు అందించాలనే లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. గత సంవత్సరం లక్ష్యానికి మించి రైతులకు రుణాలు అందించినందుకు బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. వ్యవసాయంతో పాటు మౌలిక సదుపాయాలకు రూ.39.24 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం రూ.560.38 కోట్లు ఈసారి అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఇతర రంగాలకు సంబంధించి మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.3,570.63 కోట్లు అందించాలని, విద్యారుణాలను రూ.80.26 కోట్లు, హౌసింగ్ రుణాలు రూ.200.81 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కోసం రూ.3.16 కోట్లు, పునరుత్పాదక శక్తి కోసం రూ.94.33 కోట్లు, ఇతర రంగాలకు రూ.688.31 కోట్లు మొత్తం ప్రాధాన్యత రంగాలకు ఈ సంవత్సరం రూ.13,601.72 కోట్లు అందించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేడీసీసీబీ సీఈవో రామాంజనేయులు, కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, మెఫ్మా పీడీ నాగశివలీల, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజ మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
బీమా పథకాలతో నష్టాల నుంచి గట్టెక్కండి
- రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి:
ప్రకృతి వైపరీత్యాల వల్ల సాగు చేసిన పంటలు దెబ్బతినకుండా నష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను రైతులు ఉపయోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్‌లలో 26 పంటలకు వాతావరణ పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుందని తెలిపారు.