Share News

అయ్యో... పాపం!

ABN , Publish Date - Aug 21 , 2025 | 01:45 AM

మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించగలరు. సంతోషంగా ఉన్నవారిని సడన్‌గా తన ఒడిలో లాగేసుకుంది. కన్నవాళ్లకు గర్భశోకం మిగిల్చింది. మృత్యువు కబళించిన తీరు చూస్తే అయ్యే పాపం.. ఎంత ఘోరం..! జరిగిందంటూ అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. పదేళ్లకే నూరేళ్ల నిండాయి ఆ చిన్నారులకు.. సరదా కోసం వెళ్లి మృత్యుఒడికి చేరి కన్నవారికి కడుపు కోత మిగిల్చారు ఆ ఆరుగురు.. వారంతా పదేళ్ల చిన్నారులు.. ఒకే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు.. మిత్రులంతా కలిసి ఆడుతూ పాడుతూ బుధవారం ఒడికి వెళ్లి వచ్చారు. సరదా కోసం గుంత వద్దకు వెళ్లారు. స్నాన్నం చేసేందుకు గుంతలో దిగారు. ఒక్కరి తర్వాత ఒకరు రక్షించండి.. రక్షించండి అంటూ రోదనలు పెట్టారు. వారి రోదనలతో భయపడ్డ ఒడ్డున ఉన్న చిన్నారి పరుగుపరుగున వెళ్లి జనాన్ని పిలుచుకు వాడు. అప్పటికే వారిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఒకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈఘటనతో చిగిలి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

అయ్యో... పాపం!
సంఘటనా స్థలం వద్ద బధువులు, గ్రామస్థలు, ఇన్‌సెట్‌లో మృతిచెందిన చిన్నారులు

నీటి గుంతలో సరదాగా స్నానానికి వెళ్లిన విద్యార్థులు

ఆ నీటిలో మునిగిన ఆరుగురు చిన్నారులు మృతి

చిగిలిలో విషాదఛాయలు

కర్నూలు/ఆస్పరి/ఆదోని/ఆదోని రూరల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందంటూ బుధవారం చిగిలిలో జరిగిన విషాద ఘటన ఊరు ఊరినే కన్నీటి శోకసంద్రంలో ముంచేసింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా బడిలో గురువులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విన్నారు. తోటి విద్యార్థులతో కలసి సందడి చేశారు. బడి వదలగానే గ్రామ సమీపంలోని ఎర్రగరుసు నీటి గుంతల్లో సరదాగా స్నానాలు చేయాలని అనుకు న్నారో ఏమో.. ఇంటికెళ్లి పుస్తకాల సంచులు పెట్టేసి ఐదు తరగతి చదివే ఏడుగురు విద్యార్థులు ఆ నీటి గుంట వద్దకు చేరు కున్నారు. నీటిలో దిగి క్షణాల్లో ఆనీటిలో మునిగిపోయారు. నీటి మునుగుతూ రక్షించండి.. రక్షించండి..! అంటూ చిన్నా రులు ఆర్తనాదాలు అరణ్య రోధనే అయ్యాయి. ఆరుగురు విద్యార్థులు మృత్యుఒడి చేరారు. గట్టున మరో విద్యార్థి చెప్పడంతో ఈ ఘోరం బయటకు తెలిసింది. లేదంటే ఎప్పటికి తెలిసేదో..! కన్నవాళ్లు, బంధువుల శోకంతో చిగిలి పల్లెవీధులు తడిసి ముద్దాయ్యాయి.

ఆస్పరి మండలం చిగిలి గ్రామం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు దాదాపు 110 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఐదవ తరగతిలో 25మంది విద్యార్థులు ఉన్నారు. అందరు విద్యా ర్థులతో పాటుగా ఎర్రబాట శశికుమార్‌(10), ఎర్రబాట కిన్నెరసాయి(10), కేసరం సాయికిరణ్‌ (10), ఉప్పలపాటి బీమా (10), గడ్ల వినయ్‌ (10), షేక్‌ మహాబూబ్‌ (10), దుర్గాప్రసాద్‌ ఉదయం బడికి వెళ్లారు. గురువులు చెప్పిన పాఠాలు ఎంతో శ్రద్ధగా విన్నారు. నోట్‌ పుస్తకాలు రాసుకు న్నారు. మధ్యాహ్న భోజనం బడిలోనే తిన్నారు. తోటి విద్యార్థులు, మిత్రులతో ఎంతో ఆనందంగా, సందడిగా గడిపారు. సాయంత్రం బడి వదిలే వేళాయింది. అప్పుడు సమయం 3.35 గంటలు. ఇంటికి వెళ్లే బడి గంట (లాంగ్‌ బెల్‌) మోగింది. ఆ ఏడుగురు విద్యార్థులు ఇళ్లకు చేరుకొని.. పుస్తకాల సంచులు ఇంట్లోనే పెట్టేసి ముందే అనుకున్నట్లు సాయంత్రం 4.15 గంటలకు గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉన్న ఎర్రగరుసు తవ్వకాలు చేసిన గుంతల్లో వర్షపు నీరు ఆగిన నీటి గుంత వద్దకు చేరుకున్నారు. ఎర్రబాట శషికుమార్‌, ఎర్రబాట కిన్నెరసాయి, కేసరం సాయికిరణ్‌, ఉప్పలపాటి బీమా, గడ్ల వినయ్‌, షేక్‌ మహబూబ్‌లు ఆడుకుంటూ సరదాగా నీటిలోకి దిగారు. ఆ గుంతలో మట్టిలో ఇరుక్కుపోయి భయంతో నీటిలో మునిగిపోయారు. అయితే.. గట్టున ఉన్న దుర్గాప్రసాద్‌ నీట మునుగుతున్న మిత్రులను చూసి భయంతో ఊర్లోకి పరుగు పెడుతూ వచ్చి చెప్పడంతో ఘోరం బయట ప్రపంచానికి తెలిసింది. స్థానికులు వెళ్లి నీటిలో మునిగిపోయిన చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే ఎర్రబాట శషికుమార్‌, కేసరం సాయికిరణ్‌, ఉప్పలపాటి బీమా, గడ్ల వినయ్‌, షేక్‌ మహాబూబ్‌ మృతి చెందగా, ఎర్రబాట కిన్నెరసాయి ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి రలిస్తుం డగా కన్నుమూశారు. చిన్నారులు నీటి మునిగిపోతూ రక్షించండి.. కాపాడండి.. అంటూ గట్టిగా కేకలు వేశారని, నాకు భయమేసి పరుగు పరుగున వచ్చి ఊర్లోవారికి చెప్పానని ప్రత్యేక్ష సాక్షి చిన్నారి దుర్గాప్రసాద్‌ చెబుతూనే భయంతో వణికిపోతున్నారు. చిన్నారుల ఆర్తనాదాలతో పాటు ప్రాణాలు కూడా క్షణాల్లో అనంతవాయువులో కలిసి పోయాయి. అంతా ఓగంటలో ఘోరం జరిగిపోయింది. ఆరుగురు తల్లిదంద్రులకు గర్భశోకం మిగిలింది. ్ఝ

అన్నదమ్ముల ఇంట్లో విషాదం

ఎర్రబాట రాజు, కిష్టప్ప స్వయాన అన్నదమ్ములు. వ్యవసాయ పనులే వారి జీవనాధారం. మారతమ్మ, రాజు దంపతులకు ముగ్గురు కొడుకులు సంతానం కాగా ఎర్రబాట కిన్నెరసాయి చిన్నవాడు. నాగవేణి, కిష్టప్ప దంపతులకు ముగ్గురు కొడుకులు. శశికుమార్‌ చిన్నవాడు. అన్నదమ్ముల పిల్లలు కిన్నెరసాయి, శశి కుమార్‌ ఇద్దరు కూడా ఐదో తరగతి చదువుతున్నారు. నీటి గుంటలో పడి మృ త్యుఒడి చేరడంతో అన్నదమ్ముల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆరుగురిని బలి తీసుకున్న గరుసు గుంతలు

చిగిలి గ్రామానికి కిలో మీటరు దూరంలో సర్వే నంబరు 195 పరిధిలో 118 ఎకరాలు విస్తీర్ణంలో పచ్చని కొండలు ఉన్నాయి. ఆకొండల్లో నాణ్యమైన ఎర్రమట్టి ఉండడం అక్ర మార్కులకు వరంగా మారింది. ఆరేళ్లుగా గరుసు తవ్వకాలతో భారీ ఎత్తున గుంతలు పడ్డాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుంతలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఆగుంతలకు అర కిలో మీటరు దూరంలో జడ్పీ ఉన్నతపాఠశాల, ఒకటిన్నర కిలో మీటరు దూరంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉంది. వర్షపు నీటితో నిండిన ఆ గుంతల్లో విద్యార్థులు స్నానాల కోసం నాలుగైదు రోజులగా వెళ్తున్నారని పోలీసులు పేర్కొంటు న్నారు.

ఆ నీటి గుంతల్లో స్నానాలు ప్రమాకరమని ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. అక్రమంగా ఎర్రమట్టి తరలిం చేవాళ్లు కూడా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. అభం శుభం తెలియని చిన్నారులకు ఆ గుంతల్లో దిగితే మట్టిలో కూరుకుపోయి మృత్యువాత పడుతామనే పరిజ్ఙానం ఎక్కడి. నీళ్లు కనిపిస్తే చాలు సరదాగా ఈతాడుదామనే పిన్నవయస్సు వారిది. ప్రమాదమని తెలియక నీటి గుంటల్లో దిగి మృత్యువు కౌగిలికి చేరారు. చిన్నారుల మృతికి బాధ్యులెవరు..? అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు చేసి అమ్మకాలు చేపట్టిన అక్రమార్కులా..? నియంత్రిం చడంతో విఫలమైన అఽధికార యంత్రాంగమా..? సమాధానం లేని ప్రశ్నలు ఇవి.

మూడు కుటుంబాలకు ఒక్కొక్కరే కొడుకులు..

ఉప్పలపాటి లక్ష్మి, రాముడు దంపతులకు కొడుకు బీమా, ఇద్దరు కూతుళ్లు సంతానం. కేసరం మమత, మారాజు దంపతులకు కొడుకు సాయికిరణ్‌, కూతురు సంతానం. షేక్‌ హసీనా. పీరవలి దంపతులకు కొడుకు షేక్‌ మహబూబ్‌, ఒక కుమార్తె ఉంది. ఈ మూడు కుటుంబాలకు ఒక్కొక్కరే కొడుకు ఉన్నాడు. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ ఉన్నదాంట్లో బతికే కుటుంబాలు వారివి. విధికి వారిని చూసి కన్నుకుట్టిందేమో.. నీటి ప్రమా దం రూపంలో ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు కబళించడంతో వారి ఇళ్లలో విషాదం అమలుకుంది. గడ్ల మల్లమ్మ, ఈరన్న దంపతులకు వినయ్‌ సహా ఇద్దర కుమారులు, కుమార్తె సంతానం. పెద్దవాడైన వినయ్‌ ఇలా ్ధకన్నుమూయడంతో కన్నవాళ్లు విలపిస్తున్న తీరు చూసిన ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టింది.

ఘటనాస్థలిని పరిశీలించిన అధికారులు

చిగిలిలో నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందారనే సమాచారం రాగానే కలెక్టరు పి.రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌లు పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి, డీఎస్పీలు హేమలత, వెంకట్రామయ్య, ఆస్పరి తహసీల్దార్‌ రామేశ్వరరెడ్డి, సీఐ గంగాధర్‌ను అప్రమత్తం చేశారు. తక్షణమే వారు చిగిలికి చేరుకొని ఘటనాస్థలిని పరిశీలించారు. బాధిత కుటుంబా లను పరామర్శించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. ఆదోని సబ్‌ కలెక్టరు మౌర్యభరద్వజ్‌ ఆదోని ప్రభుత్వాస్పత్రికి చేరుకొని కిన్నెరసాయి మృత దేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని సీఐ గంగాధర్‌ తెలిపారు.

తల్లిదండ్రులకు కడుపుకోత

ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడటం చాలా దిగ్ర్భాంతికరం. చిన్నారుల మృతి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. చిగిలి ఘటనతో నా మనసు ఆవేదనతో నిండిపోయింది. ఆ చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఈ ఘటన చిన్నారుల కుటుంబాల్లో భరించలేని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘటన అత్యంత దురదృష్టకరం.

సీఎం చంద్రబాబు, మంత్రుల దిగ్ర్భాంతి

ఆరుగురు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారనే సమాచారం తెలియగానే సీఎం చంద్రబాబు కలెక్టరు పి.రంజిత్‌బాషాకు ఫోన్‌ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌ బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షి మృతుల కుటుంబాలను పరామర్శించారు. టీడీపీ ఇన్‌చార్జి బి.వీరభద్రగౌడ్‌ చిన్నారుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Aug 21 , 2025 | 01:47 AM