చోరీ కేసులో ఆరుగురి అరెస్టు
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:01 AM
త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి వైభవ్‌నగర్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిలో ఐదుగురు మైనర్లు
27 తులాల బంగారు, 35 తులాల వెండి ఆభరణాల స్వాధీనం
కర్నూలు క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి వైభవ్‌నగర్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ శేషయ్య శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితులంతా బాలురు కావడం విశేషం. నగర శివారులోని ఓ డాబాలో పని చేసే షేక్షావలి అనే యువకుడు తనతో పాటు పని చేసే మరో ఐదుగురు మైనర్లను జత చేసుకున్నాడు. ఎలాగైనా దొంగ తనం చేయాలని యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేర్చుకున్నారు. ఇంటి తాళాలు పగలకొట్టేందుకు మెళకువలు నేర్చుకున్నారు. నూనె, రంపం, ఇనుపరాడ్లు సిద్ధం చేసుకున్నారు. రెండు మోటారు సైకిళ్లపైన సాయివైభవ్ నగర్‌లో రెక్కీ నిర్వహించారు.
మేనేజర్ ఇంట్లో తాళం వేసి ఉండడాన్ని గుర్తించి ఆ ఇంట్లోకి వెళ్లారు. ప్రధాన ద్వారం తాళంలో నూనెపోసి శబ్దం రాకుండా ఇనుపరాడ్డుతో తాళం విరిచారు. ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న 27 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు. ఆ తర్వాత చోరీ చేసిన సొత్తును పంచుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తును రికవరీ చేశారు. వీరిలో ఇద్దరు ఇంతకముందే రెండు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. ఈ మైనర్లంతా మెకానిక్ షెడ్లలో పని చేస్తూ అల్లరి చిల్లరగా తిరుగూతూ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.