సిద్ధేశ్వరానికి తొమ్మిదేళ్లు
ABN , Publish Date - May 30 , 2025 | 11:24 PM
కృష్ణానదిపై సిద్ధేశ్వరం సమీపంలో శ్రీశైల జలాశయానికి 860 అడుగుల ఎత్తులో అలుగు నిర్మిస్తే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందుతుంది.
అలుగు నిర్మిస్తే 50 టీఎంసీల నీటి నిల్వ
నేడు చలో సిద్ధేశ్వరం పేరిట భారీ బహిరంగ సభ
సిద్ధేశ్వరం రాయలసీమ అస్థిత్వస్వరం. తరతరాల సీమ పోరాటాలకు సిద్ధేశ్వరం గాఢమైన వ్యక్తీకరణ. గత పదేళ్లుగా రాయలసీమ ప్రజా ఆకాంక్షలకు ప్రతీక. పాలకుల నిర్లక్ష్యం, వివక్షలపై ఎలుగెత్తిన ప్రాంతీయ చైతన్యం. సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలు వినియోగించుకొనే అవకాశం రాయలసీమకు వస్తుంది. దీని కోసం అలుగు ప్రజా శంకుస్థాపన ప్రజా ఉద్యమంగా 2016 మే 31వ తేదిన జరిగింది. దీన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ రోజును సీమ పోరాటదినంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం చలో సిద్ధేశ్వరం కార్యక్రమం చేపట్టారు.
ఆత్మకూరు, మే 30(ఆంధ్రజ్యోతి): కృష్ణానదిపై సిద్ధేశ్వరం సమీపంలో శ్రీశైల జలాశయానికి 860 అడుగుల ఎత్తులో అలుగు నిర్మిస్తే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందుతుంది. సీమకు శ్రీశైలం వెనకతట్టు జలాలను అందించాలన్న సంకల్పంతోనే 1971-78 కాలంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నిర్మాణాన్ని నీటిపారుదల శాఖాధికారులు ప్రతిపాదించారు. ఇదే క్రమంలో 1976 నుంచి 1988 వరకు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ నిర్మాణ పనులు జరిగాయి. అప్పటి నుంచి కాల్వ విస్తరణ పనులు పూర్తయి 2000-01లో బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను మూడు జలద్వారాల మీదుగా చేపట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీరు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ ద్వారా బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దకు వచ్చి చేరుతోంది. తెలుగుగంగ కాల్వ నీటి విడుదల పూర్తి సామర్థ్యం 11,150 క్యూసెక్కులు, ఎస్కేప్ ఛానల్ కాల్వ నీటి విడుదల పూర్తి సామర్థ్యం 11,150 క్యూసెక్కులు కాగా ఎస్సార్బీసీ కాల్వ నీటి విడుదల సామర్థ్యం 4960 క్యూసెక్కుల ప్రవాహం వుండేలా క్రాస్‌రెగ్యులేటర్ నిర్మాణాన్ని రూపొందించారు. మూడు జలద్వారాల్లో ఒక్కో ద్వారానికి మూడు గేట్ల చొప్పున మొత్తం 9గేట్లను అమర్చారు. ఇదిలా వుండగా 2006లో పోతిరెడ్డిపాడు ప్రధాన కాల్వను 11వేల క్యూసెక్కుల నుంచి 44వేలకు సామర్థ్యంతో చేపట్టిన విస్తరణ పనులు నేటికీ కొనసాగుతున్నాయి.
9 ఏళ్లుగా ప్రజా ఉద్యమం
సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ.. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 2016 మే 31వ జరిగింది. దీనికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కదలి వచ్చారు. అఖిల భారత రైతు సంఘాల నాయకుడు, సాగునీటి సాఽధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, సీనియర్ ఇంజనీర్ సుబ్బరాయుడు, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్, సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ సాధన కమిటీ అధ్యక్షుడు వైఎన్‌రెడ్డితో పాటు 30వేల మంది జనం తరలివచ్చారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఎట్టకేలకు కపిలేశ్వరం వద్ద సీమ నేతలు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి శంకుస్థాచేశారు. ఆ తర్వాత 2017లో సీమ సత్యాగ్రహం, 2018 ఛలో ిసిద్ధేశ్వరం, అలాగే 2019లో ప్రజా పాదయాత్రను చేపట్టారు. అయితే 2020, 2021 సంవత్సరాల్లో కరోనా విపత్తు కారణంగా ఇళ్ల నుంచే స్వచ్ఛంద నిరసనలు చేపట్టారు. ఆతర్వాత 2022లో జలదీక్ష, 2023లో జల జాగరణ దీక్ష, 2024 జలసాధన దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం చలో సిద్ధేశ్వరం పేరిట భారీ బహిరంగ సభను శనివారం నిర్వహిస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి రాయలసీమ హక్కుగా తాగు, సాగు నీరు అందించాలి.
కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలి.
యువత భవితకు విద్యాలయాలు, పరిశ్రమల ఏర్పాటుతో పాటు అమరావతిని ఫ్రీజోన్ చేయాలి
రాష్ట్ర విభజన చట్టంలోని ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, కార్పొరేషన్లు సీమలో ఏర్పాటు చేయాలి.
హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్ట్‌లను మూడేళ్లలో పూర్తి చేయాలి.
రూ.1500కోట్లతో వచ్చే ఖరీఫ్‌కు 10లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేపట్టాలి. శ్రీశైల జలాశయం ముంపు గ్రామాలకు తాగు, సాగునీరుతో పాటు నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి.
గుండ్రేవుల, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టాలి.
రాయలసీమలోని కార్యాలయాల తరలింపును నిలిపివేయాలి.
శ్రీశైలం ప్రాజెక్ట్ పరిరక్షణకకు ప్లంజ్‌పూల్ మరమ్మతులు, పూడిక నివారించి రిజర్వాయర్ జీవిత కాలాన్ని పెంచడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం నిర్మించాలి.
నేడు భారీ బహిరంగ సభ
రాయలసీమ సాగునీటి సాధన సమితి పిలుపు మేరకు జలమే జీవం.. జలమే బలం.. జలమే సర్వం.. అనే నినాదంతో శనివారం సంగమేశ్వరం వద్ద భారీ బహిరంగ సభను జరపనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చేలా సాధన సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంతోనే రాయలసీమకు ప్రయోజనం
సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తేనే సీమ జిల్లాలకు మేలు జరుగుతుంది. రాయలసీమకు నీటి పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. శాంతియుతంగా రాయలసీమలోని అన్నివర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపు ఇస్తున్నాం.
-బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి, కన్వీనర్