స్వచ్ఛందంగా దుకాణాల తొలగింపు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:23 PM
నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న దుకాణాలను యజమానులు గురువారం స్వచ్ఛందంగా తొలగించారు
ఎట్టకేలకు రోడ్డుకు మోక్షం
దుకాణ యజమానులకు పలువురి అభినందనలు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న దుకాణాలను యజమానులు గురువారం స్వచ్ఛందంగా తొలగించారు. వీరిని పలువురు అభినందించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న దుకాణాలను తొలగించాలని నగరపాలక అధికారులు చెప్పినా దుకాణ యజమానులు స్పందించలేదు. ఈవిషయమై అధికారులు గతంలో కోర్టును ఆశ్రయించారు. దుకాణ యజమానులు సైతం కోర్టుకు వెళ్లారు. దీంతో సంవత్సరాల కాలయాపన జరిగింది. ఈక్రమంలో నగరపాలక అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఇటీవల హైకోర్టు నుంచి దుకాణాలను తొలగించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నగరపాలక కమిషనర్ కూడా దుకాణాలను తొలగించాలని యజమానులకు నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో నగరపాలక అధికారుల ఆధ్వర్యంలో దుకాణాల తొలగింపు అవసరం లేదని, తామే స్వచ్ఛందంగా దుకాణాలను తొలగించుకుంటామని యజమానులు ముందుకొచ్చి తొలగించారు. ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న రహదారికి మోక్షం లభించింది.